Jan 02,2021 21:17

బెంగళూరు : ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటానని కర్నాటక సిఎం యడియూరప్ప పదేపదే చెప్పుకుంటూ వస్తుండడాన్ని చూస్తుంటే.. అది అతని పదవీ గండంపై ఉన్న ఆందోళనను చూపుతోందని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డికె.శివకుమార్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా రెండున్నరేళ్లు తానే సిఎంగా ఉంటానని యడియూరప్ప పదేపదే చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని, దీని గురించి ఆయన్ను ఎవరు అడిగారని ప్రశ్నించారు. పదవికి సంబంధించి ఆయనలో ఆందోళన ఉందని, అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జనవరి 15 తర్వాత కొత్త లీడర్‌ వస్తారని యడియూరప్ప పార్టీ బిజెపికి చెందిన పలువురు ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు. యడియూరప్ప వయస్సు దృష్ట్యా బిజెపి అధిష్టానం కర్నాటక ముఖ్యమంత్రిగా మరో వ్యక్తిని తీసుకురానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇటీవలి స్థానిక ఎన్నికల ఫలితాలపై శివకుమార్‌ మాట్లాడుతూ.. అధికార పార్టీ డబ్బును వెదజల్లడంతో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసినా తమ పార్టీ కార్యకర్తలు అన్నిరకాల ఒత్తిళ్లు తట్టుకొని పనిచేశారని, మంచి ఫలితాలను సాధించారని అన్నారు.