గుజరాత్‌లో 2002లో మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాకాండ చెలరేగుతున్నపుడు జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ తనను కలిసిన ప్రతినిధి బృందంతో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ఒక వ్యాఖ్య చేశారు. 'గుజరాత్‌లో రాజ్యాంగం పనిచేయడం లేదు.' అని ఆనాడు వ్యాఖ్యానించినపుడు నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నారు. ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, మోడీ ప్రధానమంత్రిగా ఏడేళ్ళ పాలన సాగిన తర్వాత ఇప్పుడు కూడా మనం అదే మాట (దేశంలో చాలా ప్రాంతాల్లో, రాజకీయ వ్యవస్థలో వివిధ విభాగాల్లో రాజ్యాంగం పనిచేయడం లేదు) అనుకోవాల్సి వస్తోంది. ఈనాడు మనం 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులకు (వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ, నలుగురితో సమావేశమవడం) ఏం జరుగుతోందో చూడాల్సి వుంది.
ప్రస్తుతం, బెయిల్ అవకాశాలు కూడా లేకుండా వందలాది మంది ప్రజలు జైళ్ళలో మగ్గుతున్నారు. ఎందుకంటే వారు చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (యుఎపిఎ), ఇతర దేశద్రోహం వంటి ప్రమాదకరమైన చట్టాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారు నేరస్తులు లేదా తీవ్రవాదులు కాదు. రాజకీయ, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, కమెడియన్లు మాత్రమే. వారిలో 16 మంది మేథావులు, లాయర్లు, విద్యావేత్తలు వున్నారు. భీమా కోరెగావ్ కేసులో యుఎపిఎ కింద వీరందరూ అరెస్టయ్యారు. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన మతోన్మాద హింసాకాండలో 19 మంది విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు, కార్యకర్తలను యుఎపిఎ కింద బూటకపు ఆరోపణలతో ఇరికించారు. ఉత్తరప్రదేశ్ లోని 'లవ్ జిహాద్' ఆర్డినెన్స్‌లో 49 మంది జైలు పాలయ్యారు. మథురలో కప్పన్ వంటి జర్నలిస్టులు, మణిపూర్‌లో మరో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు యుఎపిఎ కింద అరెస్టయ్యారు. కమెడియన్ మున్వర్ ఫరూకీ అరెస్టయి ఇండోర్ జైల్లో వున్నారు.
రాజ్యాంగంలో కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛా హక్కును అణచివేస్తున్నారు. యుఎపిఎ అనేది క్రూరమైన చట్టం, బెయిల్ రావడం చాలా కష్టం. 2008 నవంబరులో ముంబయిలో తీవ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో బెయిల్‌కు సంబంధించి కఠినమైన నిబంధనలను ప్రవేశ పెట్టేందుకు చట్టాన్ని సవరించింది యుపిఎ ప్రభుత్వమేనని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. శాంతి భద్రతల పరిధిలో రాష్ట్రాల హక్కులను ఆక్రమించే జాతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) ఏర్పాటు కూడా ఆ కాలంలో జరిగినదే. ఆ తర్వాత మోడీ ప్రభుత్వం యుఎపిఎ, ఎన్‌ఐఎ చట్టాలను మరింత కఠినంగా చేసేలా, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా మరిన్ని సవరణలు తీసుకు వచ్చింది. రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాల విభజనలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర పాత్ర ఇచ్చారు. కానీ అది నేడు దారుణంగా దెబ్బ తింటోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, వారి వ్యక్తిగత స్వేచ్ఛ ఉల్లంఘనలో భాగం కావడమనేది రాజ్యాంగ కోర్టు (సుప్రీంకోర్టు) దగ్గర నుంచే మొదలైంది. సుప్రీంకోర్టు క్రమేణా ప్రభుత్వ (ఎగ్జిక్యూటివ్) కోర్టుగా మారుతోంది.
2019 ఏప్రిల్‌లో, వతాలి జడ్జిమెంట్‌లో యుఎపిఎ కింద బెయిల్ దరఖాస్తులను పరిశీలిస్తూ సుప్రీం కోర్టు, ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్)లో పేర్కొన్న ఆరోపణలు, అభియోగాలు సరైనవేనని, అవి నిజం కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత లేదా భారం నిందితుల పైనే వుందని కోర్టులు భావించాలని పేర్కొంది. దీంతో యుఎపిఎ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ రావడం మరింత అసాధ్యమైంది. భీమా కోరెగావ్ కేసు లోని ముగ్గురు నిందితులకు బెయిల్‌ను తిరస్కరిస్తూ ఇటీవల ముంబయి హైకోర్టు ఈ తీర్పునే ఉటంకించింది.
బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో రాజ్యాంగ సిద్ధాంతాలు లేదా నిబంధనలు అమలవడం లేదు. ముఖ్యంగా ముస్లింల విషయంలో అస్సలు అమలు కావడం లేదు. రోడ్డు మీద ఒక హిందూ యువతితో ముస్లిం యువకుడు నడిచి వెళుతుంటే ఏ హిందూత్వ సంస్థ అయినా ఫిర్యాదు చేసినట్లైతే వెంటనే ఆ ముస్లిం యువకుడిని పట్టుకుని జైల్లో వేయవచ్చు. మున్వర్ ఫరూకీ హిందూ దేవతలను అవమానించారనడానికి, మతపరమైన మనోభావాలను గాయపరిచారనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు నమోదు చేసినా అతను మూడు వారాలుగా ఇండోర్ జైల్లో వున్నాడు. ఆ కేసులో ఫిర్యాదు చేసింది స్థానిక బిజెపి ఎంఎల్‌ఎ కుమారుడు. ఆ రిట్ ఇంకా నడుస్తోంది. హిందూత్వ గ్రూపు, పోలీసులు, కోర్టు అన్నీ ఒకేరకంగా వ్యవహరించాయి.ఇలా పౌరుల హక్కులపై దాడులు వారి జీవితం, స్వేచ్ఛ వంటి రంగాల నుండి ఇతర రంగాలకు కూడా విస్తరించింది. ఆహారపు హక్కు, పని హక్కు, ఆరోగ్య, విద్యా రంగాల్లో సమాన హక్కులు వంటివన్నీ కూడా తీవ్రమైన దాడులకు గురవుతున్నాయి. కరోనా మహమ్మారి, మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అసమానతలను, ఆకలిని, నిరుద్యోగాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి.
ప్రపంచ ఆహార సూచీ-2020లో 107 దేశాల్లో భారత్ 94వ స్థానానికి దిగజారింది. 2019 డిసెంబరుతో పోలిస్తే, 2020 డిసెంబరులో కోటీ 70 లక్షల మంది నిరుద్యోగులయ్యారని సిఎంఐఇ పేర్కొంది. నిరుద్యోగం రేటు 9.1 శాతానికి పెరిగింది. కరోనాతో దుర్భర పరిస్థితులు నెలకొన్న ఈ సమయం లోనే కొంతమంది బడా వ్యాపారస్తుల ప్రయోజనాలను మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా పెంచి పోషిస్తోంది. 2020 సంవత్సరంలో కోటీశ్వరుల జాబితా (డాలర్లలో) కొత్త పుంతలు తొక్కింది. సెప్టెంబరు 2020తో ముగిసిన త్రైమాసికానికి కార్పొరేట్ రంగం లాభాల బాటలో పయనించింది. 4,234 కంపెనీల వార్షిక ఆర్థిక నివేదికలను చూస్తే లాక్‌డౌన్ సమయంలో కూడా అసాధారణ రీతిలో లాభాలు సాధించాయి. 569 శాతం స్థూల లాభాలు పెరిగాయి. 50 శాతం కంపెనీలు సెప్టెంబరు త్రైమాసికంలో తమ వేతనాల బిల్లుల్లో కోత విధించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది వేతనాల వ్యయం తక్కువగా వుంది. 70 శాతం లిస్టెడ్ కంపెనీల్లో వేతనాలు తగ్గాయి. భారీగా లాభాలు, వేతనాల్లో కోతలు ఇదీ వర్గ దోపిడీ ఉధృతికి మరో పార్శ్వం.
హిందూత్వ నయా ఉదారవాద వ్యవస్థను బలవంతంగా అమలు చేసేందుకు పౌరుని రాజ్యాంగబద్ధమైన ప్రతి హక్కు అణచివేతకు గురవుతోంది. డాక్టర్ అంబేద్కర్ ఇలా హెచ్చరించారు. ''రాజ్యాంగం మంచిదే అయినా, అమలు చేసే వారు సరిగా లేనప్పుడు అది 'చాలా చెడ్డ'దిగా మారవచ్చు'' అని పేర్కొన్నారు. 'చాలా చెడ్డ' వారు రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. పౌరుల రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరు సల్పాలని రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మనందరం కృతనిశ్చయులవుదాం. రైతుల ట్రాక్టర్ పరేడ్ ఈ పోరాటాన్ని ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగాన్ని బలహీన పరుస్తున్న హిందూత్వవాదులను ఓడించేందుకు రాజకీయ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనివార్యం.
('పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం)










