Feb 08,2021 19:18

ఇల్లంతా మొక్కలు.. ఎటు చూసినా పచ్చటి లతలు.. రకరకాల పువ్వులు.. ఒక్కసారి ఊహించు కోండి.. ఎంత ఆహ్లాదంగా ఉంటుందో! దీంతో పాటు బోలెడంత ఆక్సిజన్‌ కూడా వస్తుంది. ఇలా ఆలోచించిన ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌.. తాను పనిచేస్తున్న స్కూల్‌లో ఓ సరికొత్త కార్యక్రమం చేపట్టారు. స్కూల్‌ చుట్టూ పచ్చటి పార్కులాంటి వాతావరణాన్ని సృష్టించారు. అహ్మదాబాద్‌ జోద్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వెర్టికల్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు అందరినీ ఈ స్కూల్‌ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రసార మాధ్యమాల్లోనూ ఈ పాఠశాల తెగ వైరల్‌ అవుతోంది.


మనం పుస్తకాల్లో చదివిన దానికీ, ప్రాక్టికల్‌కీ చాలా తేడా ఉంటుంది. ఈ తేడాను వివరించేందుకు ఆ ప్రిన్సిపల్‌ ఈ హ్యాంగింగ్‌ గార్డెన్‌ డెవలప్‌ చేశారు. కరోనా వైరస్‌ రాగానే స్కూళ్లు మూతబడ్డాయి. స్కూళ్లకు పిల్లలు రావడం ఆగిపోయింది. దీంతో ఆ ఖాళీ సమయంలో సిబ్బంది ఈ గార్డెన్‌ను సృష్టించారు. ఇప్పుడు స్కూల్‌ మొత్తం ఓ గార్డెన్‌ లా మారింది. చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదభరితంగా ఉంది. 'ప్రభుత్వ స్కూళ్లు ఇంత అందంగా, ఆహ్లాదంగా ఉంటాయా?!' అనిపించేలా ఉంది ఇప్పుడా స్కూలు. చాలామంది స్కూలుకు వచ్చి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. స్కూల్‌ మొత్తంలో 500 చిన్నా, పెద్ద మొక్కల్ని నాటారు. ఇప్పుడు పిల్లలకు ఈ గార్డెన్‌ ద్వారా మొక్కల పెంపకంపై ఎంతో ఆసక్తి కలుగుతుంది. ఇది పర్యావరణానికీ మేలు చేస్తుంది. స్కూల్‌ కూడా చాలా అందంగా కనిపిస్తుంది.

పాఠశాలే.. పార్కు అయితే..!


ఈ గార్డెన్‌ కోసం ప్లాస్టిక్‌ బాటిళ్లు, క్యాన్లు ఇతరత్రా ప్లాస్టిక్‌ వ్యర్థాలు.. పారేసే వస్తువులనే వాడటం విశేషం. అహ్మదాబాద్‌లో పూర్తిగా వెర్టికల్‌ గార్డెన్‌తో ఉన్న ఏకైక స్కూల్‌ ఇదే కావడం గమనార్హం. సహజంగా స్కూళ్ల ముందు, చుట్టుపక్కల మొక్కలు నాటుతుంటారు. ఇక్కడ మాత్రం స్కూలంతా గార్డెన్‌ అయిపోయింది. స్కూల్లో నుంచి బయటకు చూస్తే.. రకరకాల మొక్కలు కనిపిస్తున్నాయి.


దీనిపై స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రతాప్‌ గెడియా మాట్లాడుతూ 'మేము సేంద్రియ పదార్థాలతోనే ఈ గార్డెన్‌ అభివృద్ధి చేశాం. దీంతోపాటూ సైన్స్‌ అండ్‌ మేథమేటిక్‌ ఎగ్జిబిషన్‌ కూడా తయారుచేస్తున్నాం. అలాగే పిల్లలు బయట అమ్మే అనారోగ్యకర ఆహారం తీసుకోకుండా, తినకుండా మరో క్యాంపెయిన్‌ ప్రారంభిస్తున్నాం. అలాగే వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా పారేసే వ్యర్థాలను ఎలా వినియోగించుకోవచ్చో చెబుతున్నాం' అని తెలిపారు.


'ప్రస్తుత పరిస్థితుల్లో భూమిపై వేడి పెరుగుతోంది. తద్వార మన పర్యావరణం, జీవరాశి నశించిపోతోంది. పర్యావరణంలో సంభవించే మార్పులు భూమిపై ఉన్న జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా జాతులు అంతరించిపోయే పరిస్థితి తలెత్తుతున్నాయి. ఈ మార్పులే అనేక ప్రకృతి విపత్తులకు కారణమవుతున్నాయి. ఫలితంగా మానవాళి అనేకానేక సమస్యలు, విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, పిల్లలు ప్రకృతిపై ప్రత్యేక దృష్టి కలిగేలా బోధన చేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకునే విధానాలు, పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణంపై వారికి సహజంగానే ఆసక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ దిశగా మేం ప్రయత్నిస్తున్నాం' అని ప్రిన్సిపల్‌ తెలిపారు.

పాఠశాలే.. పార్కు అయితే..!


ఓ మంచి ఉద్దేశంతో చేపట్టిన ఈ హ్యాంగింగ్‌ గార్డెన్‌ కాన్సెప్ట్‌ అందరికీ నచ్చుతోంది. ఈ వెర్టికల్‌ గార్డెన్‌ రూపకర్తలైన ప్రిన్సిపల్‌, టీచర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా తాము పనిచేస్తున్న పరిసరాలు, పరిధిలోనూ పిల్లలను పర్యావరణ పరిరక్షణవైపు దృష్టి మళ్లించడానికి కృషి చేసి, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.


డిజిటల్‌ తరగతి గదుల నుండి లైబ్రరీ వరకు, క్రమశిక్షణ జ్ఞానం వరకు- అన్నీ ఒకే పైకప్పు కింద! ఉపాధ్యాయులు డిజిటల్‌ బోర్డుల ద్వారా చిత్తశుద్ధితో బోధిస్తున్నారు. చాలా వివరాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలగా, ఒక ప్రొఫెషనల్‌ లోగోను సృష్టించడం నుండి, ప్రతి విద్యార్థీ, ఉపాధ్యాయుడు, సందర్శకులను ప్రేరేపించే విధంగా పాఠశాలను రూపుదిద్దారు. అంతేకాకుండా ఈ పాఠశాలలో ఏ, బి, సి పాఠాలే కాకుండా వివిధ విభాగాలు ప్రముఖులు, భారతీయ తత్వవేత్తలు, కవులు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలను సైతం పాఠశాలల తరగతుల గోడలపై ఆసక్తికరంగా ఏర్పాటు చేశారు. ఈ విజ్ఞాన గ్రంథాలయం లాంటి పాఠశాలను నిర్మించటానికి ప్రతాప్‌ అంకితభావాన్ని నిజంగానే అభినందించాలి. వారాంతపు సెలవులు సైతం తీసుకోకుండా పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. ఎందుకంటే అతనికి ఇది రెండో నివాసం లాంటిదని ప్రతాప్‌ చెబుతుంటారు. 'నవభారత నిర్మాణం కోసం, అందమైన రేపటి సమాజాన్ని సృష్టించడానికి ఈ యువ మనస్సులను, మెదళ్లను ప్రేరేపించడానికి తన వంతు సేవలను అందించడానికి తానెప్పుడూ సిద్ధమే'నని చెబుతున్నారు ప్రతాప్‌.