Jul 27,2023 08:36
  • ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కరోనా సమయంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి జిఓ 1473ను బుధవారం విడుదల చేశారు. కరోనా సమయంలో 2,917 మంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించారని పేర్కొన్నారు. ఇందులో 2,744 మంది కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 1,488 మందికి నియామకం చేసినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 1,149 దరఖాస్తులకు కూడా కారుణ్య నియామకాల కింద గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులుగా నియమించాలని ఆదేశించారు. ఆగస్టు 18లోపు వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేయాలని తెలిపారు. ఆగస్టు 24న నియామక పత్రాలు అందించాలన్నారు. సెప్టెంబరు 30న ఉద్యోగాల్లో చేరాలని ఆదేశించారు.

  • వెంటనే నియమించాలి : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు

కారుణ్య నియామకాల కింద 1149 మందికి తక్షణమే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కరోనాలో మరణించిన 2,917 మందికి కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉండగా శాఖల్లో ఖాళీలు లేకపోవడంతో పొందలేకపోయారని వివరించారు. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పిడిఎఫ్‌ తరపున, ఉద్యోగ సంఘాల జెఎసి తరపున వన్‌టైం సెటిల్‌మెంట్‌గా నియామకాలివ్వాలని కోరామని తెలిపారు. అందులో భాగంగానే జిఓ 1473ను ప్రభుత్వం విడుదల చేసిందని వివరించారు.

  • ఎపి జెఎసి అమరావతి హర్షం

కారుణ్య నియమకాలకు సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.