Aug 16,2022 22:53
  • ఏడాదికి రెండు కోట్ల్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?
  • రైతుల ఆదాయం రెట్టింపు అయిందా?
  • అందరికీ ఇళ్లు హామీ ఏమైంది?
  • మోడీ ప్రసంగంపై ప్రతిపక్షాలు ఎద్దేవా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గతంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిన ప్రధాని మోడీ ఎర్రకోట ప్రసంగంలో కొత్త వాగ్దానాలు గుప్పించారని ప్రతిపక్షాలు విమర్శించాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అందరికీ ఇళ్లు కట్టిస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన వాగ్దానాలేమయ్యాయో సోమవారం నాటి ప్రసంగంలో మోడీ మాట మాత్రంగా కూడా ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఆర్జేడి, డిఎంకె తదితర పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన సుదీర్ఘ ప్రసంగం ఏ ఒక్కరినీ ఆకట్టుకోలేకపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది.మహిళా రిజర్వేషన్‌ బిల్లును అటకెక్కించింది.ఇలా ప్రతి అంశంలోనూ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

అమిత్‌ షా కుమారుడి గురించా మాట్లాడారా?: పవన్‌ ఖేరా
అవినీతి, బంధు ప్రీతిపై పోరు గురించి డాబుసరి ప్రకటనలు చేసిన ప్రధాని మోడీ తన సన్నిహిత మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు అమిత్‌షా పుత్ర రత్నం అవినీతి గురించి ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఆ పార్టీ మీడియా విభాగం చైర్మన్‌ పవన్‌ ఖేరా మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, అవినీతి, వంశపారపర్య రాజకీయాల గురించి ప్రస్తావించిన మోడీ, ఆటగాడు కాకపోయినా, బిసిసిఐలో పదవి దక్కించుకుని వ్యవహారాలను చక్కబెడుతున్న కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా కుమారుడి గురించి కానీ, రిలయన్స్‌కు అనుబంధంగా ఉన్న అంతర్జాతీయ థింక్‌ ట్యాంక్‌లో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కమారుని గురించి కానీ ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ తన పార్టీ అంతర్గత సమస్యల గురించి అన్యాపదేశంగా చెబుతున్నట్లుగా ఉంది.ప్రధాని పరిణతి చెందిన ప్రసంగం చేస్తారని ఆశించామని, కానీ ఆయన ప్రసంగంలో ఏమీ చెప్పకపోవడం విచారకరమని పవన్‌ ఖేరా అన్నారు.

  • అవినీతిపై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల బాండ్లను ఉపసంహరించుకోవాలి: సీతారాం ఏచూరి


అవినీతి, బంధుప్రీతిపై మోడీ చేస్తానన్న పోరాటం పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసే ఎన్నికల బాండ్లను ఉపసంహరించుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. బంధుప్రీతి గురించి ప్రధాని మోడీ మాట్లాడారని, అలాంటప్పుడు మీరు పాలిస్టర్‌ త్రివర్ణాలను ఎందుకు అనుమతించారు? కోట్లాది రూపాయిలు ఎవరు ఆర్జిస్తున్నారో మాకు చెప్పండి? అని ప్రశ్నించారు. కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లకు పైబడి మాఫీ చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. రాఫెల్‌ విమానాల కొనుగోలుతో సహా వివిధ రకాల అవినీతికి ఎవరు పాల్పడ్డారని ప్రశ్నించారు. ''మోడీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా రైతుల ఆదాయాన్ని ఇప్పటికి రెట్టింపు చేసి, అందరికీ ఇళ్లులు లభించాలి. కానీ ఏమీ జరగలేదు. హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టి అవే వాగ్దానాలు పునరావృతం అయ్యాయి'' అని పేర్కొన్నారు.

  • ప్రజా సమస్యలను ప్రస్తావన లేదు : డి.రాజా


సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ మోడీ ప్రసంగంలో ఏమీ లేదని అన్నారు. ''దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. మహిళా శక్తి గురించి మాట్లాడారు. అలాంటప్పుడు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎందుకు తీసుకురాలేదు'' అని ప్రశ్నించారు.

రూపాయి విలువ రోజు రోజుకు ఎందుకు బలహీనపడుతుంది? ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని టిఎంసి ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ప్రశ్నించారు.

ఆర్‌జెడి సీనియర్‌ ఎంపి మనోజ్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం, త్రివర్ణ పతాకానికి సంబంధించిన విలువలు ఉన్నాయని, ఆ విలువల ఆధారంగా 75 ఏళ్లలో ఇప్పటి వరకు చేసిన ప్రమాణాన్ని నిరంతరం విశ్లేషించుకోవాలని అన్నారు.

శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ పంచాయితీ నుండి పార్లమెంటు స్థాయిల వరకు మహిళల ఓటింగ్‌ శాతం పెరుగుతున్నప్పటికీ, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ, రాజ్యసభ, లోక్‌సభ రెండింటిలోనూ ప్రస్తుతం ఉన్న మొత్తం 764 మంది ఎంపిల్లో ఇప్పుడు కేవలం 102 మంది మహిళా ఎంపిలు మాత్రమే ఉన్నారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో మహిళ లేకపోవడం గురించి ప్రధాని మోడీ మాట్లాడాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు.