
- విడుదల కాని కేంద్రం వాటా
- అనాధ పిల్లల అగచాట్లు
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : నిర్భాగ్యులపై కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోంది. తాను ఇవ్వాల్సిన వాటా నిధులు ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యహరిస్తోంది. దీంతో, మిషన్ వాత్సల్య పథకం అనాధ పిల్లలకు అందడం లేదు. తల్లినిగాని, తండ్రినిగాని, ఆ ఇద్దరనీగాని కోల్పోయిన పిల్లల విద్య, వైద్య అవసరాలకు ఆర్థిక సాయం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించాయి. 18 సంవత్సరాలు నిండే వరకు అనాధ పిల్లల చదువు కోసం నెలకు రూ.నాలుగు వేల చొప్పున సాయం అందజేయాలనేది ఈ పథకం ఉద్దేశం. ఇందులో రాష్ట్రం వాటా 40 శాతం కాగా, కేంద్రం వాటా 60 శాతం. కేంద్ర ప్రభుత్వం రూ.2,400, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,600 కలిపి మొత్తం నాలుగు వేల రూపాయలను అనాధ పిల్లలకు అందించాలి. ఈ పథకం కోసం ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆరు నెలలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు డబ్బులు అందడం లేదు.
కేంద్రం మెలిక
మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి అమలు చేస్తోంది. హెచ్‌ఐవి లేదా ఎయిడ్స్ బాధిత పిల్లలు, వీధి బాలలు, తప్పిపోయిన, ఇంట్లో నుంచి పారిపోయిన బాలలు, బాలకార్మికులు తదితర కేటగిరి పిల్లలకు మాత్రమే రూ.నాలుగు వేలు సాయం అందిస్తూ వస్తోంది. ఇందులో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఎటువంటి ప్రాధాన్యమూ ఇవ్వలేదు. తల్లినిగాని, తండ్రినిగాని, లేదా ఆ ఇద్దరినిగానీ కోల్పోయిన వారికి సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించింది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 60 శాతం వాటా భరిస్తానని చెప్పినా ఆర్థిక సాయం దగ్గరకొచ్చేసరికి ముఖం చాటేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో పథకం అమలుకు నోచుకోలేదు. కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ పథకం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పటిమాదిరిగానే 'మిషన్ వాత్సల్య' కింద సాయం అందిస్తున్నా, అందులోనూ మెలిక పెట్టింది. కేంద్ర ప్రభుత్వం గతంలో పేర్కొన్న కేటగిరీ పిల్లలను తగ్గించి, కరోనా కాలంలో తల్లినిగాని, తండ్రినిగాని, లేదా ఆ ఇద్దరినీగాని కోల్పోయిన వారికే 90 శాతం మేర ప్రాధాన్యం కల్పించింది. జిల్లాకు 700 నుంచి 900 లక్ష్యాన్ని నిర్ణయించింది. కరోనా వల్ల పైనపేర్కొన్న కుటుంబసభ్యులను కోల్పోయిన పిల్లలకు సాయమందిస్తోంది. మిగిలిన అనాధ పిల్లల గురించి పట్టించుకోవడం లేదు. అమ్మా, నాన్న ఇద్దరూ చనిపోయారు.

మా అమ్మ భాగ్యలక్ష్మి, నాన్న జగదీష్ ఇద్దరూ చనిపోయారు. నన్ను మా తాతయ్య, నాన్నమ్మ ఉంటున్న సంతవురిటి గ్రామానికి తీసుకొచ్చి చదివిస్తున్నారు. మా తాతయ్య వ్యవసాయం చేస్తున్నారు. వలంటీరు వచ్చి అన్ని వివరాలూ తీసుకున్నారు. డబ్బులు వస్తే మా తాతయ్య వాళ్లకు కొంతసాయంగా ఉంటుంది.
- సిహెచ్.ప్రవల్లిక, సంతవురిటి గ్రామం

ఇల్లు గడవడం కష్టంగా ఉంది
నా భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. పాప ఐదో తరగతి, బాబు రెండో తరగతి చదువుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్తేనే పూట గడుస్తోంది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. వలంటీర్లు వచ్చి ఆధార్ కార్డు, ఫొటోలు కావాలంటే ఇచ్చాను. డబ్బులు వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు ఏమీ రాలేదు.
- బి.మంగమ్మ, కాఖండ్యాం గ్రామం