Jul 30,2023 22:03

దిల్లీ: 'మేరీ మాటి మేరా దేశ్‌' పేరుతో కొత్త ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ఆల్‌ ఇండియా రేడియోలో ప్రసంగించే 'మన్‌ కీ బాత్‌' 103వ ఎపిసోడ్‌లో ఆయన ఈ ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా అమరవీరుల గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అమృత్‌ కలశ యాత్ర పేరుతో దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కలను సేకరించి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం పక్కనే అమృత్‌ వాటిక పేరుతో ప్రత్యేక స్థూపాన్ని నిర్మించనున్నామన్నారు. అకాల వర్షాల కారణంగా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రధాని అభినందించారు. అమెరికాకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సందర్భంగా భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు వందకుపైగా కళాఖండాలను అమెరికా తిరిగి వెనక్కు ఇచ్చిందని చెప్పారు. 2016, 2021లోనూ తన అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా కొనిు కళాఖండాలను భారత్‌కు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. సుమారు రూ.12 వేల కోట్ల విలువైన 10 లక్షల కేజీల మత్తు పదార్థాలను భారత్‌ నాశనం చేసి, రికార్డు సృష్టించిందని ప్రధాని చెప్పారు.