Nov 19,2023 08:43

జైపూర్‌ : మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో ప్రచారం ఊపందుకుంది. హేమాహేమీలు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. రాజస్థాన్‌లోని ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ తదితరులు పాల్గొన్నారు.ఎవరు ఎంతలా ప్రచారం చేసినా అధికారం కాంగ్రెస్‌దేనని మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే జైపూర్‌ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ప్రధాని మోడీ ఎంతలా ప్రయత్నించినా చివరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెస్‌ మాత్రమేనని అన్నారు. సంపన్నులను మరింత సంపన్నులుగా, పేదలను మరింత నిరుపేదలుగా తయారుచేసేందుకే బిజెపి ప్రభుత్వం కృషి చేస్తోందని విమర్శించారు. మిత్రుల కోసం దేశాన్ని తాకట్టు పెట్టేది బిజెపి అయితే, పేదలు, రైతులు, యువత కోసం కష్టపడేది కాంగ్రెస్‌ అని అన్నారు. పేదల కోసం తాము ఏదన్నా చేస్తే ఉచితాలు అంటూ గోల పెడతారని, కానీ ఆయన మాత్రం సంపన్నులకు రూ.15 లక్షల కోట్ల రుణాలను రద్దు చేశారని విమర్శించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకే కేంద్రం అగ్నివీర్‌ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దీనికి ఒక మార్గం కనుగొంటామన్నారు.
 

                                                                  అవినీతిలో రాజస్థాన్‌ టాప్‌ :మోడీ

రాజస్థాన్‌ను అవినీతిలో అందలమెక్కించింది కాంగ్రెస్సేనని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. నేరాలు, అల్లర్లు సంఖ్యలో రాజస్థాన్‌లో టాప్‌లో వుందన్నారు. తన బుజ్జగింపు విధానాలతో నేరస్తులు, సంఘ వ్యతిరేక శక్తులు తప్పించుకునేలా చేస్తోందని అన్నారు. భరత్‌పూర్‌లోని ఒక ర్యాలీలో మోడీ మాట్లాడారు. ఈసారి 'జాదూగర్‌'కు ఓటు వేయవద్దని రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని సిఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయాల నుండి అదృశ్యమైపోతుందన్నారు.