
- ప్రభుత్వరంగ సంస్థల్లో పర్మినెంట్ ఉద్యోగాల కుదింపు
న్యూఢిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పర్మినెంట్ ఉద్యోగాలపై కత్తి గట్టింది. గత దశాబ్ద కాలంలో భద్రతతో కూడిన 2.7 లక్షల శాశ్వత ఉద్యోగులను లే ఆఫ్‌ల పేరుతోనో, విఆర్‌ఎస్ పేరుతోనో బలవంతంగా తొలగించింది. పర్మినెంట్ పోస్టులను కుదించేసి, జాబ్ మేళాల పేరుతో తాత్కాలిక నియామకాల జాతరకు తెర లేపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సిపిఎస్‌ఈల్లో ) ఉద్యోగాలు, సంస్థల ఆర్థిక పరిస్థితిపై నిర్వహించిన అధికారిక సర్వే ప్రకారం గత దశాబ్దంలో ఈ సంస్థల్లో శాశ్వత ఉద్యోగాలు 2.7 లక్షల మేర తగ్గాయి. స్వాతంత్రానంతర భారత దేశ చరిత్రలో ఇంత పెద్దయెత్తున పర్మినెంట్ ఉద్యోగాల్లో కోత పెట్టడం బహుశా ఇదే మొదటిసారి.
2012-13నుండి 2021-2022 సం.రాల మధ్య కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ఉద్యోగాలు భారీగా కుదించబడినట్లు కేంద్ర సర్వే స్పష్టం చేసింది. 2013 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల్లో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య 17.3 లక్షలు ఉండగా 2022 మార్చి చివరి నాటికి అది 14.6 లక్షలకు తగ్గింది! అంటే 2.7 లక్షల ఉద్యోగాలు హుష్ కాకి అయిపోయాయన్న మాట. సర్వే నిర్వహించిన 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 248 మాత్రమే పనిచేస్తున్నాయి.
ఉద్యోగాల కుదింపుతో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల స్వభావం మారిపోయింది. పర్మినెంట్ రిక్రూట్‌మెంట్ తగ్గించి, తాత్కాలిక రిక్రూట్‌మెంట్‌ను పెంచారు. తాత్కాలిక ఉపాధిలో నిర్దిష్ట కాల పరిమితితో కూడిన కాంట్రాక్టు, రోజువారీ కూలీ పని ఉంటుంది. 2013లో ప్రభుత్వరంగ సంస్థల్లో మొత్తం 17.3 లక్షల మంది కార్మికుల్లో 19 శాతం మంది తాత్కాలిక కార్మికులు. వీరిలో 17 శాతం మంది ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ కార్మికులు కాగా, 2 శాతం మంది దినసరి కూలీలు. 2022లో, ఈ స్థిర-కాల కాంట్రాక్టు కార్మికుల సంఖ్య మొత్తం కార్మికులలో 36 శాతానికి, రోజువారీ కూలీల సంఖ్య 6.6 శాతానికి పెరిగింది. దీంతో తాత్కాలిక కార్మికుల సంఖ్య మొత్తం కార్మికుల్లో 42.6 శాతానికి పెరిగింది. మోదీ హయాంలో ఒక దశాబ్దంలో ప్రభుత్వరంగ సంస్థల్లో తాత్కాలిక కార్మికుల సంఖ్య మొత్తం శ్రామికశక్తిలో 19 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది.
మోడీ హయాంలో ఏడు ప్రభుత్వరంగ సంస్థలలో భారీగా ఉద్యోగులను తొలగించారు. వాటిలో బిఎస్‌ఎన్‌ఎల్ అగ్రస్థానంలో ఉంది. ఆ సంస్థ సిబ్బందిని లక్షా 81 వేలకి కుదించారు. ఆ తరువాతి స్థానంలో ఎంటిఎన్‌ఎల్ నిలిచింది. ఆ సంస్థ 34 వేల 997 మంది కార్మికులను తగ్గించింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (విఆర్‌ఎస్) పేరుతో వారినిఇంటికి సాగనంపారు. తర్వాతి స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) ఉంది. ఇక్కడ 61 వేల 928 మంది కార్మికులను ఇంటికి పంపించేశారు.. సౌత్ ఈస్టర్‌ు కోల్ ఫీల్డ్‌లో 29 వేల 140 మంది కార్మికులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)లో 28 వేల 63 పోస్టులు కోతకు గురయ్యాయి. అలాగే ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా (పకపాకి)ని టాటాకు అప్పగించినప్పుడు 27 వేల 985 మందినిలే ఆఫ్ పేరుతో తొలగించారు. మరో పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసిలో 21 వేల 120 మంది కార్మికులను తొలగించారు.
ఈ కోతలు, కుదింపుల మద్య గత పదేళ్లలో కొన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలలో నామకా కొన్ని నియామకాలు చేపట్టారు.. ఇందులో ఇండియన్ ఆయిల్ కంపెనీలో 79 వేలు, మహానది కోల్‌ఫీల్డ్‌లో 36 వేల 418, ఆటమిక్ పవర్ కార్పొరేషన్‌లో 22 వేల 235, నార్తర్‌ు కోల్‌ఫీల్డ్‌లో 17 వేల 674, హెచ్‌పిసిఎల్ రాజస్థాన్‌లో 16 వేల 422 ఉన్నాయి. వెరసి గత దశాబ్దంలో 2.7 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులను తొలగించారు. అయినా, ప్రభుత్వరంగ సంస్థల్లో లాభాలు తగ్గకపోవడం గమనార్హం. ఎలాంటి సామాజిక భద్రత లేకుండా, తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ పనిచేయించుకోవడం ద్వారానే ఇది సాధ్యమైంది. ప్రభుత్వమే ఒక పథకం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగుల సంఖ్యను కుదించి, వాటిని ప్రయివేటుకు అప్పగిస్తున్నదని కార్మిక సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణే ఇందుకు తిరుగులేని ఉదాహరణ అని పేర్కొన్నాయి.. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ వల్ల 27 వేల 985 మంది ఉద్యోగాలు పోయాయి. మార్చి 2021 నాటికి 255 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 177 లాభదాయకంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు ఇంతకు ముందు పార్లమెంటుకు తెలిపారు. ఐరాస, ఐఎల్‌ఓ వంటి సంస్థలు కార్మికుల సామాజిక భద్రత కల్పించాలని మొత్తుకుంటున్నా మోడీ సర్కార్ వాటిని బేఖాతరు చేస్తూ, అంబానీ, అదానీ, ఇతర బడా కార్పొరేట్లకు గరిష్ట స్థాయిలో లాభాలు చేకూర్చేందుకు కార్మిక హక్కులపై ఎడాపెడా దాడులకు తెగబడుతున్నది.