Nov 05,2023 17:40

చంఢీఘర్  :   అవినీతికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ పోరాటం ఓ 'జిమ్మిక్కు' అని ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ధ్వజమెత్తారు. బిజెపి తప్పులు చేశారన్న వారికి  ఆ పార్టీలో చేరగానే మంత్రి పదవులు దక్కుతాయని ఎద్దేవా చేశారు.  ఆదివారం హర్యానాలోని రోహ్ తక్ లో   ఆప్  నిర్వహించిన ఓ  కార్యక్రమంలో కేజ్రీవాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ  అవినీతి, నేరాలకు  పాల్పడిన వ్యక్తి బిజెపిలో చేరగానే.. ఈడి, సిబిఐ, ఐటి వంటి దర్యాప్తు సంస్థలు అతనిని తాకేందుకు కూడా సాహసించవని అన్నారు.

'' అవినీతి పరులంటే ఎవరు. అవినీతి పరులంటే ఈడి విచారణతో జైలు పాలైన వారు కాదు. ఈడి భయంతో బిజెపిలో చేరిన వారు అవినీతి పరులు. ఈడి దాడులతో జైలు పాలైనా  బిజెపిలో చేరని  వారు నిజాయితీపరులు. నిజాయితీపరులు  ఎప్పటికైనా  జైలు నుండి   బయటికి వస్తారు '' అని అన్నారు.
నిజాయితీలేనివారు జైలుకెళ్తే.. జీవితాంతం జైలులోనే ఉండాల్సివస్తుందని వారికి తెలుసు, అందుకే వారు  బిజెపిలో చేరతారని అన్నారు.  అవినీతిపరులు,  నిజాయితీపరుల మధ్య తేడాను  ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాలని అన్నారు.

ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఈడి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.