Nov 01,2023 09:56

న్యూఢిల్లీ :   ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆప్‌ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి సోమవారం అర్థరాత్రి  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)   సమన్లు జారీ చేసింది. నవంబరు 2న తమ ఎదుట హాజరు కావాలని పేర్కొంది.  ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22 (ప్రస్తుతం రద్దైంది) రూపకల్పన మరియు అమలులో పలు అవకతవకలకు పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. ఈ ఆరోపణలపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం(పిఎంఎల్‌ఎ) నిబంధనల కింద కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు ఈడి తెలిపింది. దీనికి సంబంధించి కేజ్రీవాల్‌ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.

ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఈ ఏడాది ఏప్రిల్‌ 16న కేజ్రీవాల్‌ వాంగ్మూలాన్ని రికార్డు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 9 గంటల పాటు ఆయనను విచారించింది. అయితే ఈ కేసులో సిబిఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, 'డర్టీ పాలిటిక్స్‌' ఫలితమే ఈ ఆరోపణలని కేజ్రీవాల్‌ మీడియాతో అన్నారు. ఆప్‌ని గద్దె దించేందుకు పలువురు నేతలపై ఈడి ఈ కేసును బనాయించిందని మండిపడ్డారు.

ఇదే కేసులో ఇప్పటికే ఆప్‌ నేతలు మనీష్‌ సిసోడియా, సంజరు సింగ్‌లు జైలులో ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సిసోడియాను సిబిఐ అదుపులోకి తీసుకోగా, సంజరు సింగ్‌ను అక్టోబర్‌ 5న ఈడి అరెస్ట్‌ చేసింది.

ఆప్‌ను నిర్మూలించేందుకే కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆప్‌ నేతలు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే కేజ్రీవాల్‌పై బూటకపు కేసులు పెట్టి జైలుకు పంపించేందుకు ఈడి సమన్లు జారీ చేసిందని ఢిల్లీ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శించారు. ఆప్‌ని చూసి కేంద్రప్రభుత్వం భయపడుతోందని సీనియర్‌ నేత అతిషి బిజెపిని ఎద్దేవా చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లలో జరగుతున్న అభివృద్ధిని చూసి బిజెపి భయపడుతోందని, అందుకే ఆప్‌ నేతలపై తప్పుడు కేసులు పెడుతోందని అన్నారు. ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌కు ఈడి సమన్లు జారీ చేసిందని ధ్వజమెత్తారు. బిజెపి కుట్రలకు, ఈడి తప్పుడు కేసులకు తాము భయపడమని, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటామని అన్నారు.