
- సిఐటియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విద్యుత్ రంగాలను ప్రయివేటీకరణ పేరుతో అమ్మకానికి సిద్ధపడిన మోడీ ప్రభుత్వంపై నిరసిస్తూ జూలై 18వ తేదీన ఢిల్లీలోని హరి కిషన్‌సింగ్ సూర్జిత్ భవన్‌లో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు సిఐటియు అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ కె హేమలత ప్రకటించారు. తిరుపతిలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎవి నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం జరిగిన సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జులై 18 తర్వాత దేశవ్యాప్తంగా దశల వారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టి ఆగస్టు తొమ్మిది నుంచి 14వ తేదీ వరకు దేశంలోని అన్ని జిల్లాలలో కనీసంగా రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు ధర్నాల నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం జయప్రదం కోసం వివిధ జాతీయ కార్మిక సంఘాలను సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశంలో మతం పేరుతో ఉద్రిక్తతలను రెచ్చగొట్టి దాని నుంచి లబ్ధి పొందాలనుకున్న బిజెపి ప్రయత్నాలు విఫలమవుతున్నాయని, తాజాగా కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. బిజెపి విధానాలను అడ్డుకోకుంటే ప్రభుత్వ రంగం దేశంలో అదృశ్యమవుతుందని హెచ్చరించారు. అన్ని స్థాయిలలోని కార్మికులు, కష్టజీవులు ఒక్కటై ప్రభుత్వ విధానాలపై పెద్దఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు ద్రోహం చేసిందని విమర్శించారు.కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాననిఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు కుంటిసాకులు చెబుతున్నారని, వేతనాలు పెంచకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా, చట్టాల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తిరుపతి దేవస్థానంలో అటవీ కార్మికులు 950 రోజులుగా రిలేనిరాహార దీక్షలు చేస్తుంటే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటిపై జూన్ 18వ తేదీన విజయవాడలో రాష్ట్రస్థాయిలో సదస్సును నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తక్షణం సిఎం జగన్మోహన్‌రెడ్డి కార్మిక సమస్యలపై చర్చించటానికి అఖిలపక్ష కార్మిక సంఘాలను పిలవాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినాన్ని పురస్కరించుకొని అన్ని జిల్లాల్లో సిఐటియు కార్యకర్తలు రక్తదానం చేస్తారని తెలిపారు. జూన్, జులైలలో శ్రామిక మహిళా సమస్యలపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో గుంటూరు, నరసరావుపేటలలో రైతు సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి జులై 10న అన్ని కలెక్టరేట్ల వద్ద జరిగే అంగన్‌వాడీల ధర్నాలకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ప్రకటించారు.
