Jul 09,2023 21:34
  • మోసగాళ్లు దేశం విడిచి పారిపోయారు

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మాటల దాడికి దిగింది. మోడీ పాలనలో దుండగులు, మోసగాళ్ల జాబితాను ఆ పార్టీ ఉటంకించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మోడీపై ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ అవినీతికి గ్యారెంటీ అయితే.. అవినీతికి వ్యతిరేకంగా చర్యకు మోడీ గ్యారెంటీ అని తన బహిరంగ సభలలో ప్రతిపక్ష నాయకులపై మోడీ ఆరోపణల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ తీరుపై కాంగ్రెస్‌ పై విధంగా స్పందించటం గమనార్హం. అవినీతి విషయంలో మోడీ ద్వంద్వ వైఖరి ఇప్పుడు దేశమంతా తెలుస్తున్నదన్నారు. అవినీతిపై మోడీని టార్గెట్‌ చేసేందుకు రాహుల్‌ గాంధీ అనర్హత వేటును ఖర్గే లేవనెత్తారు. ''రాహుల్‌ గాంధీ సత్యం కోసం పోరాడుతున్నారు. ఆ పోరాటం కొనసాగుతుంది. లలిత్‌ మోడీ, నీరవ్‌ మోడీ, మెహుల్‌ చోక్సీ, విజయ్ మాల్యా, జతిన్‌ మెహతా వంటి వారు మోడీ ప్రభుత్వ కనుసన్నల్లోనే భారత్‌ను లూటీ చేసి పారిపోయారన్నది నిజం. బీజేపీ వారిని విడిపించింది. కానీ రాహుల్‌ గాంధీని పార్లమెంటు నుంచి తరిమికొట్టడానికి మోడీ సర్కారు కుట్ర చేసింది'' అని ఆయన అన్నారు. ఇలాంటి అవినీతిపరులను తప్పించటం ద్వారా మోడీ సర్కారు అధికారాన్ని సుస్థిరరం చేసుకోవటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదన్నారు.