కార్టూమ్ : ఆపరేషన్ కావేరీలో భాగంగా 231 మంది భారతీయులతో కూడిన 12వ విమానం సౌదీఅరెబియాలోని జెద్దాహ్ నుండి ముంబయికి బయలుదేరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఈ విమానంలో 231 మంది స్వదేశానికి తిరిగివస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బగ్చీ ట్విటర్ ద్వారా బుధవారం వెల్లడించారు. మంగళవారం రాత్రి 328 మంది సూడాన్ నుండి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఇప్పటివరకు 3,000 మందిని క్షేమంగా తరలించామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. మంగళవారం రాత్రి మరో ఇమానం జెద్దాహ్ నుండి నుండి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకుందని జైశంకర్ ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరీ పేరుతో ఏప్రిల్ 24 నుండి సైనిక విమానాలు, యుద్ధ నౌకల ద్వారా సూడాన్ నుండి భారతీయులను తరలిస్తున్న సంగతి తెలిసిందే.
ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ఆర్‌ఎస్‌ఎఫ్ పారామిలిటరీ బలగాల మధ్య ప్రారంభమైన ఆధిపత్య పోరాటం వల్ల ఇప్పటివరకు 3,30,000 మందికి పైగా ప్రజలు వారివారి స్వదేశాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. మరో లక్ష మందికిపైగా సరిహద్దులు దాటి పారిపోయారని తెలిపింది. మొత్తంగా దేశం నుంచి 4 లక్షల 30 వేల మందికిపైగా దేశం నుంచి వెళ్లిపోయారని పేర్కొంది.