Sep 27,2023 12:08

న్యూయార్క్‌ :   భారత్‌ -కెనడాల మధ్య ఉద్రిక్తతల మధ్య .. విదేశాంగ మంత్రి ఎస్‌. జయశంకర కీలక వ్యాఖ్యలు చేశారు. కెనడా వ్యవస్థీకృత నేరం, వేర్పాటువాద శక్తులు, హింస మరియు ఉగ్రవాదంలను కెనడా ప్రభుత్వం పెంచి పోషిస్తోందని ఎస్‌. జయశంకర వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్థి కోసం వాటిని అనుమతిస్తోందని అన్నారు. అలాగే భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపులు, ఆదేశంలోని భారత రాయబార కార్యాలయాలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఐరాస సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన  న్యూయార్క్‌లో జరిగిన 'డిస్కషన్‌ ఎట్‌ కౌన్సిల్‌ ఆన్‌ ఫారిన్‌ రిలేషన్స్‌'లో  ఈ వివాదంపై మాట్లాడారు. ‘‘గత కొన్ని సంవత్సరాలలో, కెనడా వేర్పాటు శక్తులు, వ్యవస్థీకృత నేరాలు, హింస మరియు ఉగ్రవాదానికి సంబంధించిన ఘటనలను చూసింది. అవన్నీ దేశంలో భాగంగా కొనసాగుతున్నాయి. కాని వాస్తవానికి భారత్  ప్రత్యేకమైన, సమాచారం గురించి మాట్లాడుతోంది.  వ్యవస్థీకృత నేరాల గురించి కెనడాకు భారత ప్రభుత్వం చాలా సమాచారం అందించింది. కొంత మంది వ్యక్తులను అప్పగించాల్సిందిగా అభ్యర్థనలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి.  అక్కడ ఉగ్రవాదులు, వేర్పాటువాదులు ఉన్నారు. వారిని గుర్తించాము.’’ అని  అన్నారు.

అయితే రాజకీయ లబ్థి కోసం వాటిని కెనడా ప్రభుత్వం అనుమతిస్తోందనేది తమ ఆందోళన అని అన్నారు. దీంతో దౌత్యవేత్తలపై బెదిరింపులు, రాయబార కార్యాలయాలపై దాడులు జరిగాయి. వాటిలో చాలా వరకు అక్కడి  ప్రభుత్వం సమర్థిస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య పనితీరుపై సందేహాం వ్యక్తమౌతోందని అన్నారు. ఒక విషయం గురించి తనకు సమాచారం అందినపుడు .. ప్రభుత్వ పరంగా దానిని పరిశీలిస్తామని.. కెనడా ఆరోపణలనుద్దేశించి అన్నారు. కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలపై స్పందిస్తూ.. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి కెనడా ప్రభుత్వం తమకు సమాచారం అందిస్తే.. భారత్‌ ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

ఫైవ్‌ఐస్‌ కూటమిలో పంచుకున్న సమాచారం ఆధారంగానే ట్రూడో ఆ ఆరోపణలు చేసి వుండవచ్చన్న అమెరికా దౌత్యవేత్త వ్యాఖ్యలపై ఈ వివాదం మరింత తీవ్రమైన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. తాను ఆ ఫైవ్‌ ఐస్‌లో భాగం కాదని, అలాగే ఎఫ్‌బిఐకి చెందిన వ్యక్తిని కూడా కాదని అన్నారు. ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.