Oct 21,2023 11:23

న్యూఢిల్లీ : దౌత్య సంబంధాల విషయంలో వియన్నా ఒప్పందాన్ని భారత్‌ ఉల్లంఘించలేదని విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కోరడం ద్వారా భారత్‌ దౌత్య నిబంధనలను ఉల్లంఘించిందంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.
              దౌత్య అధికారుల సంఖ్యను బలవంతంగా తగ్గించాల్సి రావడంతో చండీఘడ్‌, ముంబయి, బెంగళూరుల్లో తమ కాన్సులేట్లలో వ్యక్తిగత సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని జోలీ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలోని కెనడా హై కమిషన్‌లో మాత్రమే ఇటువంటి సేవలు అందుబాటులో వున్నాయి.
ఇందుకు సంబంధించి వివరాలు, అనుసరించాల్సిన పద్ధతులను రూపొందించడానికి గత నెల రోజులుగా కెనడా పక్షంతో తాము చర్చలు జరుపుతున్నామని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దౌత్య సంబంధాలపై వియన్నా ఒప్పందంలో 11.1 అధికరణకు అనుగుణంగానే తమ చర్యలు వున్నాయని ఆ ప్రకటన స్పష్టం చేసింది. భారత్‌లో చాలా అధిక సంఖ్యలో దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం నిర్వహిస్తోందని భారత్‌ విదేశాంగ శాఖ ఆరోపించింది. భారత్‌ అంతరంగిక వ్యవహారాల్లో కెనడా పదే పదే జోక్యం చేసుకుంటుండడం వల్ల ఈ తగ్గింపు అవసరమైందని తెలిపింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే ప్రయత్నమిదని చూపించడానికి ఏ ప్రయత్నం చేసినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఆ ప్రకటన పేర్కొంది.