టొరంటో : వీసా సర్వీసుల్ని పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. ఖలిస్తాన్ వేర్పాటువాది నేత నిజ్జర్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య దౌత్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే గురువారం నుండి వీసాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు కెనడాలోని భారత హైకమిషన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా మరియు విదేశాల నుండి దరఖాస్తు చేసుకునే కెనడియన్ల కోసం కొన్ని రకాల వీసాను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించామని ఒట్టావాలోని భారత్ హైకమిషన్ తెలిపింది.
ఈ నిర్ణయంపై కెనడా ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ స్పందించారు. భారత్‌తో దౌత్యపరమైన వివాదం ఎన్నో వర్గాల్లో ఆందోళన సృష్టించిందని అన్నారు. ఈ సమయంలో కెనడియన్‌లకు ఇది సానుకూల సంకేతమని పేర్కొన్నారు. ఆయన భారత్ నిర్ణయంపై మరో మంత్రి హర్జిత్ సజ్జన్ కూడా స్పందించారు. ఇది మంచి నిర్ణయమని, ఆందోళనకర సమయాల్లో వీసాల రద్దు మొదటి నిర్ణయం కాకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికీ నిజ్జర్ హత్య విచారణలో భారత్ సాయం కోరుతున్నామని అన్నారు.