ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి భారత్-కెనడాల మధ్య వివాదం రాజుకున్న వేళ ... కెనడా దౌత్యవేత్తలు దేశాన్ని వీడాలంటూ కేంద్రం విధించిన డెడ్‌లైన్ ముగియడంతో కెనడా దౌత్యవేత్తలు గురువారం భారత్‌ను వదిలిపెట్టారు.
ఈ పరిణామంపై కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఘాటుగా స్పందించారు. భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని తెలిపారు. భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ... భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని అన్నారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని అన్నారు. కెనడా దౌత్యవేత్తల గుర్తింపును భారత్ ఉపసంహరించుకోవడం అనైతిక, అసాధారణ చర్యగా ఆమె అభివర్ణించారు ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని... అందుకే కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని స్పష్టం చేశారు. 41 మంది దౌత్యవేత్తలువారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని జోలీ వెల్లడించారు.
భారత దౌత్యవేత్తల విషయంలో మేము అలా చేయం : మంత్రి జోలీ
'' దౌత్యవేత్తల గుర్తింపు రద్దుతో భద్రతాపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వారిని స్వదేశానికి తరలించాం. దౌత్య గుర్తింపు రద్దు లాంటి నిర్ణయాలతో ప్రపంచంలోని ఏ దౌత్యవేత్తా క్షేమంగా ఉండరు. కాబట్టి మేము భారత దౌత్యవేత్తల విషయంలో ఇలాంటి చర్యను చేపట్టబోము '' అని మంత్రి జోలీ మీడియా సమావేశంలో వివరించారు.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం రాజుకుంది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది. ఈ నేపథ్యంలో ... గురువారం 41 మంది దౌత్యవేత్తలువారిపై ఆధారపడిన 42 మంది సభ్యులు భారత్‌ను వదిలి తమ స్వదేశానికి వెళ్లారు.