వాషింగ్టన్ : భారత్-అమెరికా మధ్య సంబంధాలు అత్యంత ఉన్నత స్థాయికి చేరుకున్నాయని, మోడీ ప్రభుత్వం వీటిని మరోస్థాయికి తీసుకుని వెళ్లనుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. చంద్రయాన్ ప్రాజెక్టు మాదిరిగానే ఇరు దేశాల సంబంధాలు చంద్రుడిపైకి, అంతకుమించి పైకి కూడా వెళతాయని అన్నారు. వాషింగ్టన్‌లోని ఇండియా హౌస్‌లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన 'సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్‌షిప్' అనే కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నాయని చెప్పడమే కాదు, ఇవి వేరే స్థాయికి, వేరే ప్రదేశానికి కూడా తీసుకుని వెళ్లబోతున్నామని జైశంకర్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల నిర్మాణంలో ప్రవాసుల సహకారం అద్భుతమని చెప్పారు. భారత్‌లో ఇటీవల జరిగిన జీ20 సమావేశాలు గురించి మాట్లాడుతూ సభ్య దేశాల కృషితోనే సమావేశాలు విజయవంతమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా అమెరికా నుంచి లభించిన సహకారం, మద్దతు, అవగాహనతో ఈ సమావేశాలను విజయవంతం చేయగలిగామని అన్నారు. అలాగే, ప్రస్తుత భారతదేశం గతంలోని భారత్‌దేశం కంటే భిన్నమైనదని అన్నారు. ప్రస్తుత భారతదేశానికి చంద్రయాన్, జి-20 సమావేశాలను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యం ఉందని చెప్పారు. కోవిడ్ సమయంలో తన దేశప్రజలకు మాత్రమే సహాయం చేయకుండా, సుమారు 100 ప్రపంచ దేశాలకు భారత్ చేయి అందించిందని జైశంకర్ తెలిపారు.