Sep 25,2023 13:36

న్యూఢిల్లీ  :   మొట్టమొదటి సి-295 మధ్యశ్రేణి రవాణా విమానం సోమవారం భారత వైమానిక దళం (ఐఎఎఫ్‌)లో చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమక్షంలో ఘజియాబాద్‌లోని హిండెన్‌ ఎయిర్‌ బేసి ఈ కార్యక్రమం జరిగింది. ఐఎఎఫ్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌. చతుర్వేది సహా ఐఎఎఫ్‌కి చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఐఎఎఫ్‌లోని స్వాడాన్‌ 11లో సి-295ని చేర్చారు. ఇది ఐఎఎఫ్‌ పురాతన స్వాడ్రన్‌లలో ఒకటి. ప్రస్తుతం  ఇది  గుజరాత్‌లోని వడోదరలో ఉంది.

ఎయిర్‌బస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌తో ఈ విమానాల సేకరణకు రూ. 21,935 కోట్ల ఒప్పందం జరిగిన రెండేండ్ల తర్వాత ఈనెల 13న ఎయర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి మొదటి విడతలో 56 సి -295 ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అందుకున్నారు. కాలం చెల్లిన అవ్రో-748 విమానాల స్థానంలో వీటిని భర్తీ చేశారు. స్పెయిన్‌ నుండి సెప్టెంబర్‌ 20న సి-295 విమానం గుజరాత్‌లోని వడోదరలో ల్యాండ్‌ అయిన సంగతి తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్‌లో వడోదరలో 295 విమానాల తయారీ కేంద్రానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ప్రైవేట్‌ కన్సార్టియం ఆధ్వర్యంలో భారత్‌లో తయారయ్యే తొలి సైనిక విమాన ప్లాంట్‌ ఇదే. సి-295 అత్యాధునిక రవాణా విమానంగా పేరొందింది. 71 మంది సైనిక దళాలను, 50 పారాట్రూపర్లను ఇది చేరవేస్తుంది. ప్రస్తుత బరువైన విమానాలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం సి-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లు యుద్ధసామాగ్రిని, సైనికులను సులభంగా చేరవేస్తాయి.