Sep 25,2023 15:01
  • మహిళా జట్టు నయా చరిత్ర
  • ఫైనల్స్‌లో శ్రీలంకపై ఘన విజయం
  • ఆసియా క్రీడల్లో 11 పతకాలతో 5వ స్థానం
1

హాంగ్జౌ: భారత మహిళల క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో తొలిసారి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న మహిళల జట్టుగా నిలిచింది. హర్మన్‌ప్రీత్‌ సారథ్యంలోని భారత జట్టు సోమవారం జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 19పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత టాస్‌ గెలిచిన భారతీయ మహిళల జట్టు.. ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్నది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్మృతి మంధానా(46), జెమీమా రోడ్రిగ్స్‌(42) బ్యాటింగ్‌లో రాణించారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మహిళల జట్టును భారత బౌలర్లు దెబ్బతీశారు. టిటాస్‌ సాధుకు మూడు, రాజేశ్వరీ గౌక్వాడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. శ్రీలంక జట్టులో హాసిని పెరీరా(25), నీలాక్షి డిసిల్వా(23) టాప్‌ స్కోరర్స్‌. దీంతో లంక మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97పరుగులు మాత్రమే చేసింది. దీంతో 19పరుగుల తేడాతో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సేన విజయం సాధించింది. స్వర్ణం సాధించిన భారత మహిళా క్రికెటర్లకు భారత కమ్యూనిస్టుపార్టీ(మార్క్సిస్టు) ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.

ఎయిర్‌రైఫిల్‌లో రికార్డు స్వర్ణం

ఎయిర్‌ రైఫిల్‌ 10మీటర్ల విభాగంలో భారత్‌ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. రుద్రాంక్ష్‌ పాటిల్‌, దివ్యాన్ష్‌, తోమర్‌తో కూడిన బృందం ఫైనల్లో 1893.7పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. దీంతో భారత్‌ పతకాల పట్టికలో తొలి స్వర్ణం జమ అయ్యింది. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్‌, దివ్యాన్ష్‌, తోమర్‌ వ్యక్తిగతంగానూ ఫైనల్‌కు చేరుకున్నారు. థోమర్‌ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించాడు. ఫైనల్‌ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్‌ మూడో స్థానం, తోమర్‌ ఐదోస్థానం, దివ్యాన్ష్‌ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. పురుషుల రోయింగ్‌-4 ఈవెంట్‌లోనూ భారత్‌ కాంస్య పతకం దక్కింది. రెండోరోజు ఆసియా క్రీడల పోటీలు ముగిసే సరికి భారత్‌ 11 పతకాలతో 5వ స్థానంలో నిలిచింది.

టాప్‌ సీడ్‌ రోహన్‌ బోపన్న జోడీకి షాక్‌..రెండో రౌండ్‌లోనే ఇంటికి

2

టెన్నిస్‌ పురుషుల డబుల్స్‌లో టాప్‌సీడ్‌ రోహన్‌ బొప్పన్న, యుకీ బాంబ్రీకి షాక్‌ తగిలింది. తమ కంటే తక్కువ ర్యాంక్‌ ప్లేయర్ల చేతిలో రెండో రౌండ్‌లో ఓడిపోయారు. సోమవారం జరిగిన రెండోరౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌ ద్వయం సెర్గే ఫొమిన్‌, ఖుమోయున్‌ సుల్తానోవ్‌.. చేతిలో బోపన్న, బాంబ్రీ పరాజయాన్ని చవిచూశారు. మ్యాచ్‌ ఆఖర్లో బాంబ్రీ సర్వీస్‌ చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. దాంతో భారత జంట 2-6, 6-3, 10-6 పాయింట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో రుతుజా భోసలే, కర్మాన్‌ థాండీ బోణీ కొట్టారు. కజకిస్థాన్‌కు చెందిన ఝనెల్‌ రస్తెమోవ, అరుజాన్‌ సగండికోవాపై రుతుజా, కర్మాన్‌ 6-4, 6-2తో గెలుపొందారు. ఈ మ్యాచ్‌ సుమారు 93 నిమిషాల పాటు సాగింది.

లికిత్‌ సెల్వెరాజ్‌కు నిరాశ

100మీ. పురుషుల బ్రెస్ట్‌ స్టోక్‌ ఫైనల్లో లికిత్‌ సెల్వెరాజ్‌ నిరాశపరిచాడు. సోమవారం జరిగిన 8మంది స్విమ్మర్లు పాల్గొన్న ఫైనల్లో లికిత్‌ 1.01:62సెకన్లతో 7వ స్థానంలో నిలిచాడు. ఇందులో చైనాకు చెందిన క్విన్‌ హల్‌యంగ్‌ 57.76సెకన్లతో ఆసియా గేమ్స్‌లో రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక 50మీ. బ్యాక్‌స్ట్రోక్‌లో ఒలంపియన్‌ శ్రీహరి నటరాజ్‌ 25.39సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు చేరాడు. ఈ రౌండ్‌లో చైనాకు చెందిన క్యూ-జిహూ 24.38సెకన్లు అగ్రస్థానంలో నిలిచాడు.
వుషూ పురుషుల 60కిలోల విభాగంలో సూర్యభాను క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన మూడురౌండ్ల పోటీలో సూర్యకుమార్‌ 2-1తో ఇస్లోంబెక్‌(ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించాడు.
బాక్సింగ్‌ పురుషుల 46-51కిలోల విభాగంలో దీపక్‌, విజయం సాధించాడు. మలేషియాకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌పై యునానిమస్‌ డెసిషన్‌లో గెలిచాడు.

table