Nov 22,2023 10:40
  • ఫైనల్లో సౌరభ్‌ కొఠారిపై గెలుపు

కౌలాలంపూర్‌ : అంతర్జాతీయ బిలియర్డ్స్‌, స్నూకర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్‌ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను భారత్‌కు చెందిన పంకజ్‌ అద్వాని చేజిక్కించుకు న్నాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పంకజ్‌.. 2018 ప్రపంచ ఛాంపియన్‌, భారత్‌కే చెందిన సౌరభ్‌ కొఠారిని చిత్తుచేశాడు. తొలి గంటలో 26-180పాయింట్లతో వెనుకబడ్డ పంకజ్‌.. ఆ తర్వాత వరుసగా పాయింట్లు సాధించాడు. దీంతో పంకజ్‌ 1000-416పాయింట్ల తేడాతో సౌరభ్‌ కొఠారిపై గెలిచాడు. పంకజ్‌ వరుసగా 250 పాయింట్లు సాధించి పైచెయ్యి సాధించినా.. ఆ తర్వాత కొఠారి పుంజుకొని 99పాయింట్లతో రాణించాడు.
        ఈ క్రమంలో పంకజ్‌ 259, 176పాయింట్లు సాధించి 900పాయింట్ల మార్క్‌కు చేరుకున్నాడు. 2003 లో తొలిసారి పంకజ్‌ ప్రపంచ బిలియర్డ్‌ టైటిల్‌ నెగ్గిన పంకజ్‌.. తొమ్మిదిసార్లు 'లాంగ్‌ ఫార్మాట్‌' టైటిల్‌ను, ఒకసారి ప్రపంచ బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలువగా.. 8సార్లు 'పాయింట్‌ ఫార్మాట్‌' ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో 26 సార్లు వరల్డ్‌ ఛాంపియన్‌గా నిలిచిన పంకజ్‌ అద్వానీ నయా చరిత్ర సృష్టించాడు. ఇటీవల దోహాలో ముగిసిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ పంకజ్‌.. 900-273 తేడాతో భారత్‌కే చెందిన రూపేష్‌ షాను ఓడించాడు. 14ఏళ్లకే బిలియర్డ్స్‌లో అరంగేట్రం చేసిన పంకజ్‌.. రికార్డు స్థాయి విజయాలతో సత్తా చాటుతున్నాడు.