న్యూఢిల్లీ : ఆదాయ పన్ను చట్టం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను ప్రయోజనాలను పొందుతున్న హిందూ ఉమ్మడి కుటుంబాల (హెచ్‌యుఎఫ్) సంఖ్య సుమారు 8.76 లక్షలకు చేరుకుందని కేంద్రం పేర్కొంది. గత ఐదేళ్లలో ఇదే కనిష్టస్థాయి అని వెల్లడించింది. దేశంలో హెచ్‌యుఎఫ్ లకు పన్ను ప్రయోజనాలపై ఏకరూప పౌర స్మృతి (యుసిసి) ప్రభావాన్ని ప్రభుత్వం అంచనా వేసిందా అని జనతా దళ్ ఎంపి రామ్‌నాథ్ ఠాకూర్ అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో మంగళవారం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధాన మిచ్చారు. ఏకరూప పౌర స్మృతి (యుసిసి) కింద వారి పన్ను కేటాయింపులపై ఇంకా సమీక్ష చేపట్టలేదని అన్నారు. ప్రస్తుతం యుసిసి అమలులో లేనందున అటువంటి పన్ను మినహాయింపులను అంచనా వేయలేదని అన్నారు.
2020-21ఆర్థిక సంవత్సరంలో 9.25 లక్షలకు పైగా హెచ్‌యుఎఫ్ కుటుంబాలు పన్ను ప్రయోజనాలను పొందగా, ఆ సంఖ్య క్రమంగా క్షీణిస్తూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 8.77లక్షల కుటుంబాలకు చేరగా, గతేడాది 8.76కి చేరింది.