ఒక ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. అక్క లోక్షిత ఒకటవ తరగతి, చెల్లి డింపుల్ ఎల్‌కేజి చదువుతున్నారు. ఆ రోజు ఎనిమిదిన్నర అయినా ఇద్దరూ నిద్ర లేవలేదు. వాళ్ల అమ్మ 'పాపలూ.., త్వరగా లేవండి.. స్కూలుకు టైం అవుతోంది' అని లేపసాగింది. నిద్రతో కళ్లు నలుపుకుంటూ లోక్షిత లేచింది. బద్దకంగా స్నానం చేసి ఇంట్లోకి వచ్చింది. డింపుల్ చిన్నది కావడంతో వాళ్ల అమ్మ స్నానం చేయించి డ్రస్ వేసింది. ఇద్దరికీ టిఫిన్ పెట్టింది. లోక్షిత వాళ్ల అమ్మని 'ఫోన్ చూస్తూ టిఫిన్ తింటా. ఫోన్ ఇవ్వ మమ్మీ' అంది. అప్పటికే టైం అయిందని కంగారు పడుతున్న వాళ్ల అమ్మ కోపంతో అరిచింది. దాంతో సైలెంట్‌గా ఇద్దరూ టిఫిన్ చేసి, బ్యాగు తగిలించుకుని స్కూలుకు వెళ్లారు.
క్లాస్ రూమ్‌కు వెళ్లిన లోక్షితను టీచర్ హోం వర్క్ బుక్ తీసుకుని రమ్మంది. వెంటనే లోక్షితకు గుర్తు వచ్చింది, తాను హోంవర్క్ చేయలేదని. భయంగా టీచర్ దగ్గరకు వెళ్లింది. బుక్ చూసి టీచర్‌కు కోపం వచ్చింది. ఎందుకు హోం వర్క్ చేయలేదో కారణం అడిగింది. ఇంటికి వెళ్లగానే బ్యాగు పక్కన బెట్టి, అమ్మ ఫోన్ తీసుకుని ఆడుకుంటూ ఉండిపోయింది. దాంతో హోం వర్క్ చేయలేదు. లోక్షిత కారణం చెప్పలేదు. టీచర్‌కు కోపం ఎక్కువై బెత్తంతో లోక్షిత చెయ్యిపై కొట్టింది. దాంతో తోటి పిల్లలు లోక్షితను చూసి నవ్వారు. పిల్లలు లోక్షిత చదువు రాని మొద్దు పిల్ల అంటూ హేళన చేయసాగారు. దీనంతటికి కారణం తాను 'ఫోన్ చూడటం వల్లే' అని గుర్తు తెచ్చుకుంది లోక్షిత. ఇక నుంచి ఫోన్ చూడకుండా హోంవర్క్ చేసుకోవాలని, అందరి కన్నా బాగా చదవాలని నిర్ణయించుకుంది.
- సనుమూరు లోక్షితా సుదీప్తి, ఎల్‌కెజి,
బాలాజీ విద్యా మందిర్ స్కూలు,
నరసాపురం గ్రామం, ఇందుకూరు పేట మండలం,
నెల్లూరు జిల్లా.










