May 22,2023 14:34

న్యూఢిల్లీ :   రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు తొందర పడాల్సిన అవసరం లేదని సోమవారం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 30కి ఇంకా నాలుగు నెలల గడువు వుందని అన్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే అన్ని సమస్యలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ)  సున్నితంగా ఉంటుందని  గవర్నర్‌ పేర్కొన్నారు. క్లీన్‌ నోట్‌ పాలసీకి అనుగుణంగా రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

విత్‌డ్రా ప్రక్రియను క్రమబద్దీకరించడానికి మాత్రమే గడువు విధించామని, ఎదురయ్యే అన్ని సమస్యలను ఆర్‌బిఐ పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. సెప్టెంబర్‌ 30 నాటికి చెలామణీలో ఉన్న రూ.2,000 నోట్లలో చాలా వరకు ఆర్‌బిఐకి తిరిగి వస్తాయని అన్నారు. ఇప్పటికే పెట్రోల్‌ బంకుల్లో రూ. 2,000 నోట్లను మార్చుకునేందుకు రద్దీ అధికంగా ఉందని అన్నారు. రేపటి నుండి బ్యాంకుల్లో రూ. 2,000 నోట్ల మార్పిడి ప్రారంభం కానుందని,  నోట్ల మార్పిడికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

2016 నోట్ల రద్దు సమయంలో ప్రజలు భారీ లైన్లలో నిలబడి ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు.  కొంతమంది చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చాయని తెలిపారు.   ఈ నేపథ్యంలో నోట్ల మార్పిడి కోసం వచ్చేవారికి నీడ, నీళ్లు వంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ముఖ్యంగా వేసవి నేపథ్యంలో సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. అలాగే కౌంటర్లన్నింటిలో నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది. రూ.2,000 నోట్ల స్థానంలో ఇతర నోట్లను ఇచ్చేందుకు తగినంత నగదు అందుబాటులో ఉంచామన్నారు.

రూ.50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు దాస్‌ గుర్తు చేశారు. ఆ నిబంధన రూ.2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువని తెలిపారు. చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2,000 నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని వెల్లడించారు. రూ.1,000 నోట్లను తిరిగి ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.