Sep 25,2023 20:59
  • ఆ పద్దతులను మానుకోవాలి
  • చర్చలు స్వేచ్ఛగా జరగాలి
  • ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌

న్యూఢిల్లీ : బ్యాంక్‌ బోర్డుల్లో ఒక్కరిద్దరే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న విషయాలు తమ దృష్టికి వచ్చాయని ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. సోమవారం అర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ల డైరెక్టర్లతో సమావేశం జరిగింది. ఈ సందర్బంగా శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ.. ''పెద్ద వాణిజ్య బ్యాంకులలో కూడా ఒకరు లేదా ఇద్దరు బోర్డు సభ్యుల అధిక ఆధిపత్యం మా దృష్టికి వచ్చింది. అలాంటి చర్యలు మానుకోవాలి. బోర్డు చర్చలు స్వేచ్ఛగా, నిస్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి. బోర్డులో ఒకరు లేదా ఇద్దరు సభ్యులు, లేదా ఛైర్మన్‌ లేదా వైస్‌ ఛైర్మన్‌ ఆధిపత్యం లేదా అధిక ఆధిపత్యం ఉండకూడదు. మేము పెద్ద వాణిజ్య బ్యాంకులలో కూడా దీనిని గమనించాము. ఇది మంచి మార్గం, విధానం కాదు.'' అని అన్నారు. డైరెక్టర్లందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని.. ఒక అంశంలో ఫలానా డైరెక్టర్‌ మాటే తుది నిర్ణయం కాకూడదని శక్తికాంత దాస్‌ బ్యాంకర్లకు సూచించారు.
గతంలో యెస్‌ బ్యాంక్‌ సంక్షోభంలోకి జారిన విషయం తెలిసిందే. ఎస్‌బిఐ నేతృత్వంలో ప్రభుత్వం బెయిల్‌ ఇప్పించింది. దీనికి ఆర్‌బిఐ మద్దతు ఇచ్చింది. యెస్‌ బ్యాంక్‌ కో-ఫౌండర్‌ రాణా కపూర్‌ ఆ బ్యాంక్‌కు అప్పట్లో ఎండి, సిఇఒగా ఉన్నారు. బ్యాంక్‌ నిధులను దారి మళ్లించి.. దివాలా తీసేలా చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ చీఫ్‌ చందా కొచ్చర్‌ క్విడ్‌ప్రోకో కేసు తెలిసిందే. వీడియోకాన్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్దంగా రుణాలు ఇవ్వడం ద్వారా ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు మేలు జరిగేలా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే శక్తికాంత దాస్‌ బ్యాంకర్లను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌లకు డైరెక్టర్లుగా ఎన్నుకోబడిన వారు రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నలాజీ, ఇతర బ్యాంకింగ్‌ అంశాల్లో నైపుణ్యం కలిగి ఉండాలని దాస్‌ సూచించారు. సమావేశాల్లో ముందుగానే సిద్ధం చేసుకున్న ఎజెండా నోట్స్‌ను పరిశీలించి సంబంధిత ప్రశ్నలు అడగాలని తెలిపారు. డైరెక్టర్లు తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం, స్పష్టం చేయడం చాలా ముఖ్యమన్నారు.