
ముంబయి : భారత బ్యాంకింగ్ వ్యవస్థ నిలకడగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. అత్యాధునిక ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న అస్థిరత భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. గురువారం ముంబయిలో నిర్వహించిన ఫైనాన్షియల్ రెసీలియన్స్ సదస్సులో శక్తికాంత్ దాస్ ప్రసంగించారు. కరోనా మహమ్మారి ప్రభావం, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా, ఐరోపా దేశాల్లోని బ్యాకింగ్ రంగాల్లో నెలకొన్న సంక్షోభంతో ఆర్థిక రంగ స్థిరత్వంపై దృష్టి సారించామని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్కెట్ నియంత్రణ సంస్థలు, ప్రభుత్వాలు ఇప్పుడు ఈ అంశంపైనే దృష్టి సారించాయని చెప్పారు. భారత్‌లో ఇటీవల బ్యాంకులు, ఇతర ద్రవ్య నియంత్రిత సంస్థల నిబంధనలు, పర్యవేక్షణను ఆర్‌బిఐ మరింత బలోపేతం చేసిందని అన్నారు.