ముంబయి : కొనే స్తోమత లేని వారికి నాలుగు నెలల పాటు ఉల్లిపాయలను తినకున్నా పెద్దగా నష్టమేమీ ఉండదని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే (షిండే వర్గం) సోమవారం వ్యాఖ్యానించారు. ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 2023, డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై ఎగుమతి సుంకాన్ని విధిస్తున్నట్లు ఈ నెల 19న విడుదల చేసిన ప్రకటనలో ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఎగుమతి సుంకం ప్రకటనపై మంత్రి దాదా భూసే స్పందించారు. ''మీరు రూ.10 లక్షల విలువైన వాహనాన్ని వినియోగిస్తున్నప్పుడు.. రిటైల్ ధరకంటే రూ. 10 లేదా రూ. 20 ఎక్కువైనా ఉల్లి పాయలను కొనుగోలు చేయవచ్చు. ఉల్లిని కొనుగోలు చేసే స్తోమత లేని వారు రెండు నుండి నాలుగు నెలల పాటు తినకున్నా పెద్ద తేడా ఉండదు'' అని అన్నారు. '' కొన్ని సార్లు ఉల్లి క్వింటాల్‌కు రూ. 200 ధర పలుకుతుంది. కొన్నిసార్లు ఇది క్వింటాల్‌కు రూ.2,000 ధర ఉండవచ్చు. చర్చలు నిర్వహించి సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలి'' అని అన్నారు.
దేశంలోని అతిపెద్ద టోకు ఉల్లిపాయల మార్కెట్ అయిన లాసల్‌గావ్ సహా నాసిక్‌లోని అన్ని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ(ఎపిఎంసి)లలో సోమవారం ఉల్లి వేలాన్ని నిరవధికంగా నిలిపివేశాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు నిరవధింకంగా ఉల్లి వేలంలో పాల్గనవద్దని నాసిక్ జిల్లా ఉల్లివ్యాపారుల సంఘం పిలుపునిచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎగుమతి సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.










