Jul 27,2023 06:52

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఉప నాయకుడు గౌరవ్‌ గగోరు అవిశ్వాస తీర్మాన నోటీస్‌ ఇవ్వగా, స్పీకర్‌ దానిని ఆమోదిం చారు. దీనిపై చర్చ ఎప్పుడు నిర్వహించేది తగిన సమయం లో తెలియజేస్తానని స్పీకర్‌ ఓం బిర్లా బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం ఇది రెండోసారి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ విశ్వాసం చూరగొన్నంత కాలం ఏ ప్రభుత్వమైనా మనగలుగుతుంది. సభలో మెజార్టీ ఎంపీల విశ్సాసాన్ని కోల్పోయినప్పుడు ఆ ప్రభుత్వం పతనమవు తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75(3) ప్రకారం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నికైన సభకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. లోక్‌సభ విధివిధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్‌ 198 ప్రకారం లోక్‌సభ సమావేశంలో ఉండగా, ఉదయం 10 గంటలలోపు లిఖిత పూర్వకంగా అవిశ్వాస తీర్మాన నోటీసును ఎవరైనా సభ్యులు అంద జేస్తే, అందిన పదిరోజుల్లో దానిని స్పీకర్‌ సభకు చదివి వినిపించారు. స్పీకర్‌ చదివాక కనీసం 50 మంది లోక్‌సభ సభ్యులు ఆ తీర్మానానికి మద్దతు తెల పాలి. అప్పుడు ఆ తీర్మానంపై సభలో ఎప్పుడు చర్చ జరిపేది స్పీకర్‌ నిర్ణయిస్తారు.
స్వాతంత్య్రానంతర భారత దేశ పార్లమెంటు చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం. కాగా, మోడీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెండో అవిశ్వాస తీర్మానమిది. పార్లమెంటులో మొట్ట మొదటి అవిశ్వాస తీర్మానం 1963లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంపై ఆచార్య జె బి కృపలానీ ప్రవేశపెట్టారు. 1962 యుద్ధం ముగిసిన వెంటనే ప్రధాని చైనా విధానంపై ఆయన ఈ అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చారు. జిసి మల్హోత్ర పుస్తకం' కేబినెట్‌ రెస్పాన్స్‌బిలిటీ టు లెజిస్లేచర్‌, కాన్ఫిడెన్స్‌, నో కాన్ఫిడెన్స్‌ మోషన్స్‌ ఇన్‌ లోక్‌సభ' ( ప్రస్తుతం పార్లమెంటు డిజిటల్‌ లైబ్రరీలో ఉంది) ప్రకారం కృపలానీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ 21 గంటల 33 నిమిషాల సేపు సాగింది. (1963 ఆగస్టు 19-22). అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టగా తీర్మానానికి అనుకూలంగా 62 ఓట్లు, వ్యతిరేకంగా 347 ఓట్లు వచ్చాయి. దీంతో ఆ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇందిరా గాంధీ 16 ఏళ్ల పాలనలో (1966-1977), (1980-1984 అక్టోబరు31న హత్యకు గురయ్యేవరకు) 15 అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రానంతర భారత దేశంలో అత్యధిక అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్న ప్రధాని ఇందిరానే. మొదటి విడతలో 12 అవిశ్వాస తీర్మానాలను (1967లో అటల్‌ బిహారి వాజ్‌పేయి పెట్టిన తీర్మానంతో సహా), రెండో విడతలో మూడు అవిశ్వాస తీర్మానాలను ఆమె ఎదుర్కొన్నారు.

  • అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైన ప్రభుత్వాలు

ఆరవ లోక్‌సభలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం ద్వారా పతనమైంది. మొరార్జీ దేశారు నేత్వృంలోని జనతా ప్రభుత్వం రెండు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొంది. మొదటి దానిలో మొరార్జీ నెగ్గారు. రెండో అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తి కాక ముందే ఆయన ప్రభుత్వం రాజీనామా చేసింది. వైబి చవాన్‌ (కాంగ్రెస్‌-ఐ) ఆ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ 'ఈ ప్రభుత్వం పట్ల అన్ని తరగతుల ప్రజలూ విశ్వాసాన్ని కోల్పోయారు' అని పేర్కొన్నారు. దానిపై చర్చ పూర్తికాక ముందే 1979 జులై 15న దేశారు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి సమర్పించారు.
స్వాతంత్య్రానంతర భారత పార్లమెంటు చరిత్రలో ఎక్కువ మంది ప్రధానులు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నవారే. లాల్‌ బహదూర్‌ శాస్త్రి, పివి నరసింహా రావు మూడేసి సార్లు అవిశ్వాస పరీక్షను ఎదుర్కోగా, మొరార్జీ దేశారు, ఎబి వాజ్‌పేయి రెండేసి సార్లు, జవహర్‌ లాల్‌ నెహ్రూ, రాజీవ్‌ గాంధీ ఒక్కొక్కసారి ఎదుర్కొన్నారు. చరణ్‌ సింగ్‌, విపి సింగ్‌, చంద్రశేఖర్‌, హెచ్‌డి దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ ఎలాంటి అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కోలేదు.
పివి నరసింహారావు మూడు అవిశ్వాస పరీక్షల నుంచి గట్టెక్కారు. అయితే, మూడవ అవిశ్వాస తీర్మానంపై ఆయన నెగ్గిన తీరు వివాదాస్పదమయింది. 1993 జులైలో సిపిఐ(ఎం) సభ్యులు అజరు ముఖోపాధ్యాయ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం 251-265 ఓట్ల తేడాతో వీగిపోయింది. ఏడాది తరువాత జెఎంఎం ఎంపీలకు ముడుపులు ముట్టజెప్పి అవిశ్వాస పరీక్షలో నెగ్గుకొచ్చారని తేలింది. 1998లో పివి నరసింహారావు వర్సెస్‌ సిబిఐ కేసులో పార్లమెంటేరియన్లు సభలో చేసే ఉపన్యాసాలు, ఓటింగ్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి రక్షణ ఉన్నందున తాము ఏమీ చేయలేమని సుప్రీం కోర్టు చేతులెత్తేసింది.
మోడీకి ముందు చివరి బిజెపి ప్రభుత్వానికి నేతృత్వం వహించిన వాజ్‌పేయికి వ్యతిరేకంగా 2003లో సోనియా అవిశ్వాస తీర్మానాన్ని తెచ్చారు. ఆ తీర్మానం 125 ఓట్ల తేడాతో వీగిపోయింది. వాజ్‌పేయి 1996లో , 1998-99లో స్వల్ప కాలం పాటు అధికారంలో ఉన్నారు. తరువాత 1999 -2004 మధ్య ప్రధానిగా ఉన్నారు. 1999 ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన అవిౠ్వసతీర్మానం ఒక్క ఓటు తేడాతో నెగ్గడంతో ఆయన ప్రభుత్వం కుప్పకూలింది. తగినంత సంఖ్యా బలం లేని కారణంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్షాలు విముఖత చూపడంతో 12వ లోక్‌సభ అర్ధంతరంగా రద్దయింది.
నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో రెండోసారి అవిశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నారు. 2018లో మొదటి సారి చాలా మంది సభ్యులు ఒకే విధమైన అవిశ్వాస తీర్మాన నోటీస్‌లు ఇవ్వగా లాటరీ పద్ధతిలో కేశినేని శ్రీనివాస్‌ (తెలుగుదేశం) తీర్మానాన్ని ఎంపికచేశారు. 12గంటల పాటు చర్చ తరువాత 199 ఓట్ల తేడాతో ఆ తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది, వ్యతిరేకంగా 325 మంది ఓటు చేశారు. చర్చ సందర్భంగా 'మైనార్టీలపైన, మహిళలపైన నేరాలు పెరుగుతుంటే ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని' విమర్శించిన రాహుల్‌ గాంధీ, తన ప్రసంగం అయిపోగానే ప్రధాని మోడీ సీటు దగ్గరకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకోవడం పలువురిని ఆశ్చర్యపరచింది. రాఫెల్‌ కుంభకోణం, వివాదాస్పద నోట్ల రద్దు వంటి వాటిపైన ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టాయి.