Nov 20,2023 10:51

రైతాంగ సాయుధ పోరాటంలో ఎగిసిన భూ ఉద్యమం
వినోబాభావే ఉద్యమంగా ప్రచురించడం సరైందికాదు
ఆంధ్రజ్యోతి కథనంపై వామపక్షాల ఖండన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : 
నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముందుకు తెచ్చిన భూ ఉద్యమాన్ని వక్రీకరించేలా ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించడం తగదని వామపక్ష పార్టీలు ఖండించాయి. చరిత్రను వక్రీకరించేలా కాకుండా వాస్తవాలను పత్రికలో ప్రచురించాలని కోరాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆదివారం ఆంధ్రజ్యోతి ఎడిటరుకు లేఖ రాశారు.

ఈ నెల 19న ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాష్ట్రంలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమాన్ని విమర్శిస్తూ భూములపై బంకులు అనే కథనంలో ఆంధ్రప్రదేశ్‌లో వినోబాభావే కాలంలోనే భూ పంపిణీ జరిగినట్లు రాశారని తెలిపారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అబద్ధాలను సరిదిద్దే పేరుతో మరో అబద్ధాన్ని మీరు ప్రచారంలోకి తీసుకురావడం సరైందికాదని అన్నారు. నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముందుకు తెచ్చిన భూ పంపిణీ కార్యక్రమాన్ని దెబ్బతీసేందుకు భూస్వాముల ప్రయోజనాల కోసమే వినోబాభావే భూదాన కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. భూస్వాములు దయతో భూములు ఇచ్చినట్లు ప్రకటించినా వాటిని ఎక్కడా పేదలకు పంచలేదని, ఆ భూములు ఇప్పటికీ భూస్వాముల ఆధీనంలోనే ఉన్నాయని తెలిపారు. ఎవరికీ చెందని ప్రభుత్వ భూములను కూడా భూదానం పేరుతో పంచినట్లు ప్రచారం చేశారు తప్ప ఒక్క ఎకరా కూడా పేదలకు దక్కలేదన్నారు. రాష్ట్రంలో 1940 నుంచి 15 ఏళ్లపాటు మళ్లీ 1960 నుంచి 1970 వరకు అంటే పదేళ్ల పాటు రాష్ట్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో పెద్దయెత్తున భూ పోరాటాలు జరిగాయని తెలిపారు. చల్లపల్లి జమీందారు భూములకు సంబంధించిన భూ పోరాటాల్లో కమ్యూనిస్టులు ముఖ్య పాత్ర అద్వితీయమైనదని గుర్తుచేశారు.

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు తదితర నాయకులు ఈ పోరాటాలకు ప్రత్యక్షంగా నాయకత్వం వహించారన్నారు. పేదలు ఎర్రజెండాలు నాటి ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. 1960 నుంచి నూజివీడు తాలూకాలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు దాసరి నాగభూషణరావు, చలసాని జగన్నాథరావు, బడ్డు దేవసుందరం నాయకత్వంలో బంజర భూముల ఆక్రమణ ఉద్యమాన్ని నిర్వహించి వేలాది ఎకరాల బంజరు భూములను పేదలకు పంపిణీ జరిగిందన్నారు. ఈ భూములకు 1969, 1970లలో ఆనాటి కలెక్టరు ఆర్కే వేపా 15 వేల ఎకరాలకు అసైన్‌మెంట్‌ పట్టాలను మంజూరు చేశారన్నారు. ఆ పోరాటాల ఫలితంగా పేదల చేతుల్లో వున్న ఆ భూములకు అనివార్యంగా తరువాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు పట్టాలు పంపిణీ చేశాయని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కూడా నూజివీడులో ఆ భూములకు శాశ్వత పట్టాలను మంజూరు చేయటం మాత్రమే జరిగిందన్నారు. రాష్ట్రంలో భూ పంపిణీపై వాస్తవాలు ఇవి కాగా, కమ్యూనిస్టులు చేసిన పోరాటాన్ని విస్మరించి భూ పంపిణీ వినోబాభావే సాగించినట్లు చెప్పటం చరిత్రను వక్రీకరించటమే అవుతుందని అన్నారు.

రాష్ట్రంలో వినోబాభావే భూములు ఎక్కడ పంచారో, అవి ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో ఒక ఉదాహరణ ఇచ్చినా సంతోషిస్తామన్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములు పేదల చేతుల నుంచి అన్యాక్రాంతమైనా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదన్నారు. దురాక్రమణదారులకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కొమ్ముకాశాయని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన జిఓ కూడా అన్యాక్రాంతమైన భూములకు చట్టబద్ధత కల్పించడానికి తప్ప పేదలకు పెద్దగా ఉపయోగపడదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తానే భూములు పంచినట్లు అబద్ధాలు చెబుతున్నారని, మీరు రాసింది వాస్తవమని, అయితే ఆ భూములు పోరాటాల ద్వారా ఎలా పేదల చేతుల్లోకి వచ్చాయో అనే వాస్తవాలను కూడా ప్రజలకు అందించాలని కోరారు.