Apr 21,2023 12:31

ప్రజాశక్తి-పిఠాపురం (కాకినాడ) : ప్రతీ ఒక్కరూ సాహిత్యంపై మక్కువ పెంచుకొని అనేక విషయాలపై అవగాహన పెంచుకోవాలని పలువురు వక్తలు కోరారు. పిఠాపురం ఆదిత్య స్కూల్‌ ప్రాంగణంలో ర్యాలి ప్రసాద్‌ రచించిన చారిత్రక గ్రంధం '' పిఠాపురం చరిత్ర'' పుస్తకం ఆవిష్కరణ సభ ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్‌ నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సాహిత్య ప్రముఖులు, కవులు, కళాకారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా శేషారెడ్డి మాట్లాడుతూ ... పిఠాపురం పౌరాణికంగానూ, చారిత్రకంగానూ విశిష్టమైనదని ఆ ఖ్యాతిని నేటి తరానికి అందజేసేలా రచయిత పుస్తక రచన చేశారన్నారు. ఈ పుస్తకాన్ని రచయిత తండ్రి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సభ్యులు ర్యాలి వెంకట్రావుకు అంకితమిచ్చారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన పిఠాపుర సంస్థాన వారసులు రాజా రావు రామ రత్నారావు మాట్లాడుతూ ... కవిగా విశిష్టతను చాటుకున్న ర్యాలి ప్రసాద్‌ ఈ చారిత్రాత్మక పుస్తకాన్ని రచించి యావత్‌ పిఠాపురానికీ కానుకగా యిచ్చారన్నారు. కవి, వైద్యులు కాదులూరి వెంకట్రావు రెడ్డి మాట్లాడుతూ ... ఈ పుస్తకం పిఠాపురం పట్టణానికి నిఘంటువు వంటిదని, రాబోయే తరాల వారికి దిక్సూచి కాగలదని అభిప్రాయపడ్డారు. ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాల ఛైర్మన్‌ బుర్రా అనుబాబు మాట్లాడుతూ ... ర్యాలి ప్రసాద్‌ రచించిన ఈ పుస్తకంలోని అనేక అంశాలు విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల్లో చేర్చదగిన ప్రాముఖ్యత కలిగినవని అన్నారు. సూర్యరాయ విద్యానంద గ్రంధాలయ కార్యదర్శి కొండేపూడి శంకరరావు సమీక్షిస్తూ ఈ పుస్తకం పరిశోధకులకు మార్గదర్శకంగా వుంటుందని, ప్రతీ పిఠాపుర వాసి తమ వద్ద దాచుకోవలసిన పుస్తకమన్నారు. కవి ఆర్‌ రత్నాజరు సమీక్షిస్తూ పిఠాపురం మొత్తాన్నీ రచయిత ఈ పుస్తకంలో యిమిడ్చారని అభిప్రాయపడ్డారు. మన ఊరు మన బాధ్యత కార్యదర్శి అల్లవరపు నగేష్‌ మాట్లాడుతూ ... ఈ తరానికి పిఠాపురం చరిత్ర గ్రంధం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. ఈ సభలో మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, గట్టి శ్రీకృష్ణ దేవరాయలు, బాదం ఉదయ సూర్యప్రకాష్‌, తదితరులు ప్రసంగించారు. అనంతరం రచయితను అతిథులు, పుర ప్రజలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విజయసారథి వందన సమర్పణ చేశారు.