- భీతావహ వాతావరణం సృష్టించిన పోలీసులు
- దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు
ముంబయి : ముంబయిలోని మానవ హక్కుల నేత, పాఠశాల ఉపాధ్యాయుడు వాహిద్ షేక్ నివాసంపై బుధవారం ఎన్‌ఐఎ అధికారులు దాడి చేసి, బీభత్సం సృష్టించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కేసులో బుధవారం దేశవ్యాప్తంగా సుమారు 20 ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు జరిపింది. ఇందులో భాగంగా ఉదయం ఐదు గంటల ప్రాంతంలో వాహిద్ నిద్రిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. తాము పోలీసులమని చెబుతూ తలుపులు తెరవాలని కోరారు. 2006 జూలై 11న జరిగిన వరుస పేలుళ్ల ఘటనకు సంబంధించిన కేసులో వాహిద్ ఇప్పటికే తొమ్మిది సంవత్సరాల జైలు జీవితం గడిపారు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం న్యాయస్థానం 2015లో ఆయన్ని విడుదల చేసింది. కాగా తలుపులు తెరిచే ముందు వాహిద్ వారంట్ చూపాలనికోరగా వారు నిరాకరించారు. అనంతరం గుర్తింపు కార్డులు చూపాలంటూ ఆయన పదేపదే వారిని కోరారు. 'మొదట తాము ముంబయి పోలీసులమని వారు చెప్పారు. తర్వాత ఢిల్లీ నుండి వచ్చామని తెలిపారు. ఒకరేమో తాము యూపీ పోలీసులమని అన్నారు. పోలీసులకు సహకరిస్తానని వారికి చెప్పాను. పారదర్శకంగా వ్యవహరిస్తే ఇంటిలోకి రావచ్చని అన్నాను. లీగల్ నోటీసు ఇచ్చి సోదాలు చేసుకోవాలని సూచించాను' అని ఆ తర్వాత వాహిద్ ఫోన్‌లో చెప్పారు. వాహిద్‌ను, ఆయన భార్యా పిల్లలను ఇంటి నుండి బయటికి రాకుండా పోలీసులు చాలా సేపు నిర్బంధించారు.
ఉదయం 10 గంటలకు న్యాయవాది ఇబ్రహీం హర్బత్ అక్కడికి రాగానే తాము ఎన్‌ఐఏ నుండి వచ్చామని తెలిపారు. పీఎఫ్‌ఐకి వ్యతిరేకంగా నమోదైన ఓ కేసుకు సంబంధించి సోదాలు చేయడానికి వచ్చామని చెప్పారు. సెర్చ్ వారంట్ కోసం వాహిద్ పట్టుపట్టగా చేతిరాతతో రాసిన ఓ చిన్న కాగితాన్ని అందజేశారు. ఆ తర్వాత లిఖిలపూర్వక వారంట్ కాపీ కోసం ఓ అధికారిని కార్యాలయానికి పంపారు. ఉదయం 11 గంటలకు సోదాలు ప్రారంభించారు. వాహిద్ పిల్లలు బయటకు వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అనుమతించారు. పీఎఫ్‌ఐ మాడ్యూల్స్‌ను ధ్వంసం చేసేందుకే దాడులు జరిపామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ స్థానిక పోలీసు చెప్పారు. గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ పర్యటనకు వచ్చినప్పుడు దానికి ఆటంకం కలిగించేందుకు కుట్ర చేశారంటూ నమోదు చేసిన కేసుకు సంబంధించి ఈ సోదాలు నిర్వహించారు. వాహిద్ నివాసం వద్ద ఆరు గంటల పాటు భీతావహ వాతావరణం సృష్టించిన పోలీసులు ఓ తలుపును ధ్వంసం చేశారు. ఇంటి వెలుపల అమర్చిన సీసీటీవీని కూడా పగలగొట్టారు.