- బిబిసిపై బ్రిటన్ పెద్దల ఒత్తిడి
లండన్ : ఇజ్రాయిల్-పాలస్తీనా ఘర్షణల్లో హమాస్‌ను మిలిటెంట్లు లేదా పోరాటవాదులు అని కాకుండా టెర్రరిస్టులుగా పేర్కొనాలని బిబిసిపై బ్రిటన్ పెద్దల నుంచి ఒత్తిడి వస్తోంది. ఇక్కడ డౌనింగ్ స్ట్రీట్‌లో యూదు కమ్యూనిటీని ఉద్దేశించి ఇమ్మిగ్రేషన్ మంత్రి రాబర్ట్ జెన్‌రిక్ మాట్లాడుతూ, హమాస్ అల్ అక్సా ఆపరేషన్‌ను ఖండించారు. ఈనాడు అక్కడ ఏం జరుగుతోందో యావత్ ప్రసంచం చూస్తోంది. అయితే మీడియాలో వస్తున్నట్లుగా వారు మిలిటెంట్లు లేదా పోరాటవాదులు కాదు, వారు టెర్రరిస్టులు, హంతకులు, ఆటవికులు అని శివాలెత్తారు. బిబిసి లేదా మనం టెలివిజన్ తెరపై చూస్తున్న మరెవరైనా సరే వారిని టెర్రరిస్టులుగానే సంబోధించాలన్నారు. బిబిసి తన మార్గదర్శకాలను మార్చుకోవాలని కూడా సలహా ఇచ్చారు. తొలుత యూదు గ్రూపులు సాంస్కృతిక శాఖ మంత్రి లూసీ ఫ్రాజర్‌ను కలసి హమాస్ పోరాటవాదులను ఉగ్రవాదులుగా బిబిసి పేర్కొనాలని కోరారు. ప్రస్తుతానికైతే, బిబిసి దీనికి అంగీకరించ లేదు. ఉగ్రవాదులు అనే పదాలను రాజకీయ నాయకులు పేర్కొనడం వేరు, ఒక వార్తా సంస్థగా తాము అలా ఏకపక్షంగా ముద్ర వేయలేం. ఆ సంస్థ కార్యకలాపాలను బట్టే మిలిటెంట్లు లేదా ఫైటర్లు అని పేర్కొనడం సముచితంగా ఉంటుందని బిబిసి అధికారులు తెలిపారు. 2019లో చివరిసారిగా బిబిసి తన సంపాదకీయ మార్గదర్శకాలను ఆధునీకరించింది.