Nov 08,2023 11:45

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌లోని జమ్ము, సాంబ జిల్లాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం సోదాలు చేపట్టింది. మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలను అదుపులోకి తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. పాస్‌పోర్ట్‌ చట్టాలను ఉల్లంఘించడం మరియు మానవ అక్రమ రవాణా కేసులకు సంబంధించి మయన్మార్‌ వలదారులు నివసించే ప్రాంతాల్లోనే ప్రత్యేకంగా దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. జమ్ములోని బతిండి తాత్కాలిక నివాసం నుండి రోహింగ్యా ముస్లిం అయిన జాఫర్‌ ఆలమ్‌ అనే వ్యక్తిని తెల్లవారు జామున 2 గంటలకు అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. మరొక అనుమానితుడు అధికారుల నుండి తప్పించుకుంటున్నట్లు సమాచారం.

మానవ అక్రమ రవాణా కేసుకు సంబంధించి జమ్ముకాశ్మీర్‌తో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఎన్‌ఐఎ సోదాలు జరిపింది. త్రిపుర, అస్సాం, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా, రాజస్తాన్‌, పుదుచ్చేరిల్లో కూడా బుధవారం ఉదయం నుండి దాడులు జరిపినట్లు ఎన్‌ఐఎ అధికారులు తెలిపారు. రాష్ట్ర పోలీసుల సమన్వయంతో ఈ కేసులతో సంబంధం ఉన్న అనుమానితుల నివాసాలపై సోదాలు చేపట్టినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సంబంధాలు కలిగి ఉన్న మానవ అక్రమ రవాణాదారుల అక్రమ రాకెట్‌ను వెలికితీసేందుకు ఈ పది రాష్ట్రాల్లోనూ సోదాలు చేపట్టినట్లు తెలిపారు.