Oct 20,2023 10:09

ఢిల్లీ : న్యూస్‌క్లిక్ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ మరియు హెచ్.ఆర్ అధినేత అమీర్ చక్రవర్తిలను క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద అరెస్టు చేసి రిమాండ్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.ఆర్. గవాయ్ మరియు ప్రశాంత్ కుమార్ మిశ్రా గురువారం ఢిల్లీ పోలీసులకు నోటిసులు జారీ చేశారు. ఈ కేసు అక్టోబర్ 30న విచారణకు రానుంది. మొదట, కోర్టు మూడు వారాల తర్వాత విచారణ తేదీని ఇచ్చింది, కానీ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దసరా సెలవుల తర్వాత వెంటనే కేసును జాబితా చేయాలని కోర్టును కోరారు. అతని క్లయింట్, పుర్కాయస్థకు 70 ఏళ్లు పైబడిన వారని, చాలా రోజులు నుండి రిమాండ్ లో ఉన్నారని తెలిపడంతో విచారణ తేదీని 30కి మార్చారు. ఆగస్టు 17న నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను అనుసరించి అక్టోబర్ 3న ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం పుర్కాయస్థ మరియు చక్రవర్తిలను అరెస్టు చేసిన విషయం విదితమే.