Jul 31,2023 22:50
  • కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో స్థానిక, జోనల్‌ వ్యవస్థపై చర్చ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజనానంతరం పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనలపై సచివాలయంలో సోమవారం రాష్ట్ర సర్వీసెస్‌శాఖ కార్యదర్శి పి భాస్కర్‌ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఉన్న నాలుగు జోన్ల స్థానంలో ఆరు జోన్లు ఏర్పాటు చేయాలా? లేక మరో ఒకట్రెండు జోన్లు పెంచాల్సి ఉంటుందా? అనే అంశంపై ఉద్యోగ సంఘాలతో ప్రధానంగా చర్చించారు. ఉద్యోగులు, నిరుద్యోగులతో కూడిన అంశాల నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించుకుని లిఖితపూర్వక అభిప్రాయాలు ప్రభుత్వానికి ఇవ్వనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. జోన్ల వ్యవస్థ మార్పులతో ఉద్యోగుల ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, జోన్ల వారీ ఉద్యోగుల పంపకాలు జరిగే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సూచించాయి. ఉద్యోగులను ఆయా జోన్లకు శాశ్వత ప్రాతిపదికగా అలాట్‌మెంట్‌ చేసేటప్పుడు వారికి ముందుగా ఆప్షన్‌ సౌకర్యం కల్పించాలని సూచించారు. వీటితోపాటు జోన్‌-1లో ఉండి జోన్‌-2లోకి చేరనున్న అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు), ఇప్పటి వరకు జోన్‌-3లో ఉండి ప్రస్తుతం జోన్‌-5లోకి చేరనున్న గూడూరు, సూళ్లురుపేట ఉద్యోగుల పిల్లలకు స్థానికత విషయంలో ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని అన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చిన ఉద్యోగుల పిల్లలకు స్థానికత కనీసం పది సంవత్సరాల పాటు కొనసాగించాలని కోరారు. గోదావరి, వంశధార, హంద్రీనీవా, వెలిగొండ, శ్రీశైలం ప్రాజెక్టుల్లో పనిచేస్తున వారికి రాష్ట్రపతి ఉత్తర్వులు పనిచేయవని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసిన నేపథ్యంలో రూ.500 కోట్లు దాటిన ప్రతి ప్రాజెక్టుకు రాష్ట్రపతి ఉత్తర్వులు, జోనల్‌ సిస్టమ్‌ను అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సూచించాయి. వీటితోపాటు లోకల్‌ స్టేటస్‌ గతంలో 10వ తరగతి లోపు ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడ లోకల్‌ స్టేటస్‌ వచ్చేదని, దానిని 7వ తరగతి వరకు తగ్గించాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ సాగింది. లోకల్‌ క్యాడర్‌లో ఏ పోస్టు ఉండాలి? జోనల్‌ స్థాయిలో ఏ పోస్టు ఉండాలి? అనే అంశంపై ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం అభిప్రాయాలు కోరింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో లోకల్‌ క్యాడర్‌కి వెళ్లే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. రాష్ట్రపతి ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులకు మేజర్‌ సమస్య ఉందని, 121/2కోటాలో బయట వాళ్లు ఎఎస్‌ఒ, ఎస్‌ఒలుగా సచివాలయానికి వస్తున్నారని, సచివాలయంలో పనిచేసే ఎఎస్‌ఒ, ఎస్‌ఒలు కూడా సిటిఒ, ఎసిటిఒలుగా వెళ్లేవారికి ఇబ్బందిగా ఉన్నట్లు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు సూచించిన అభిప్రాయాలను సిఎస్‌ అధ్యక్షతన ఏర్పాటైన రాష్ట్రస్థాయి కమిటీకి ఇవ్వనున్నట్లు కార్యదర్శి పోలా భాస్కర్‌ తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి, ఎపి ఎన్‌జిఒ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఎపి రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి, యుటిఎఫ్‌, ఎస్‌టియు, పిఆర్‌టియు, ఎపిటిఎఫ్‌ అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు, సాయి శ్రీనివాస్‌, ఎం కృష్ణయ్య, జి హృదయరాజు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు బి సుగుణ, డ్రైవర్ల సంఘం అధ్యక్షులు ఎస్‌ శ్రీనివాసరావు, ఎపి ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రజనీస్‌బాబు, ఎపి జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్స్‌ అండ్‌ వెటర్నరీ లైవ్‌స్టాక్‌ ఆఫీసర్స్‌ సర్వీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి సేవానాయక్‌తోపాటు పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గన్నారు.