Jul 27,2023 06:31

రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన విభజన హామీల అమలులో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నయవంచన ధోరణి మరో మారు స్పష్టమైంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు సున్నా చుట్టేసి, రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కును తెగనమ్మడానికి సిద్ధపడి నమ్మకద్రోహానికి నిలువెత్తు చిరునామాగా నిలిచిన బిజెపి మిగిలిన విభజన హామీలను తుంగలో తొక్కడానికి బరితెగించింది. పార్లమెంటు సాక్షిగా మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానందరారు రాష్ట్ర ప్రయోజనాలకు చెల్లుచీటి రాసేసినట్టు కుండబద్దలు కొట్టారు. కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటనకు రాష్ట్ర బిజెపి నేతలు, ఆ పార్టీకి వంత పాడే ఇతరులు ఎటువంటి కొత్త భాష్యాలు, వింత వ్యాఖ్యలు చేస్తారో చూడాలి! వారే వంచనా శిల్పానికి తెరతీసినా రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి బిజెపికి ఏమాత్రం పట్టవన్న విషయం సామాన్య ప్రజానీకానికి కూడా తేటతెల్లమైంది. కానీ, బిజెపి నేతలు ఆడమన్నట్టల్లా ఆడుతూ, వారెక్కిన పల్లకిని బహుభద్రంగా మోస్తున్న రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నేతలకు మాత్రం చీమ కుట్టినట్టైనా లేకపోవడం బాధాకరం!
కడప ఉక్కు సాధ్యం కాదంటూ, దుగరాజపట్నం పోర్టు కుదరదంటూ కేంద్ర మంత్రి తాజాగా చేసిన ప్రకటన రాష్ట్ర ప్రయోజనాలను, విభజన హామీలను పూర్తిగా విస్మరించినట్టే! ఈ రెండిటి నిరాకరణతో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ (విభజన) చట్టంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలన్నింటికి సున్నా చుట్టినట్టైంది. వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో ఏర్పాటు చేయవలసి ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) నివేదిక ఇచ్చినట్లు తాజా ప్రకటనలో మంత్రి చెప్పారు. ఈ నివేదిక తరువాత ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దాదాపు ఆరేళ్లయింది. ఇంతకాలం ఆ 'ఫోర్స్‌' ఏమిచేస్తోందో అర్ధం కాదు! ఇప్పుడు కూడా ఆరేళ్ల కిందటి విషయాన్నే కేంద్ర మంత్రి సెలవిచ్చారంటే కీలకమైన ఉక్కు ఫ్యాక్టరీ పట్ల బిజెపి సర్కారు మోసపూరిత వైఖరిని అర్ధం చేసుకోవచ్చు. దుగరాజపట్నం పోర్టు నిరాకరణకు చెప్పిన సాకు కూడా ఇటువంటిదే! పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది పార్లమెంటు. దాని ఆధారంగా చర్యలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యతా కేంద్రానిదే! దానికి భిన్నంగా 'నాకు నచ్చితేనే చేస్తా' అన్నట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్య సూత్రాలను, రాజ్యాంగాన్ని బేఖాతరు చేయడమే!
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి వరుసగా జరుగుతున్న అన్యాయాలపై ప్రజానీకంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజానీకం చేస్తున్న పోరాటం రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఇటీవలే సిపిఎం నేతృత్వంలో జరిగిన మహా పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఇదే వైఖరి కొనసాగితే మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు గిరిజనులు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక హోదాను నిరాకరించి, అభివృద్ధి ఆశలను మొగ్గలోనే తుంచడంపై అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి ఉంది. విశాఖ రైల్వే జోన్‌ను తిరస్కరించడం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడంపై ఎక్కడికక్కడ అసంతృప్తి రగులుతూనే ఉంది. తాజా నిరాకరణలతో రాష్ట్రం పట్ల బిజెపి వైఖరి ఏమిటో మరింతగా స్పష్టమైంది. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దోబూచులాట ధోరణిని మానుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. పార్లమెంటులోనూ, బయటా బిజెపి దుర్మార్గాన్ని ఎండగట్టాలి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నుండే ఆ నిలదీత ప్రారంభం కావాలి. దీనికి లోక్‌సభ ముందుకు ఇప్పటికే వచ్చి ఉన్న అవిశ్వాస తీర్మానం మంచి అవకాశం. రాష్ట్రాభివృద్ధి పట్ల వైసిపి, టిడిపిల చిత్తశుద్ధికి కూడా ఈ తీర్మానం గీటురాయిగా మారుతుంది.