Nov 22,2023 07:14

          ఆదివారం నాడు జరిగిన అర్జెంటీనా అధ్యక్ష తుది ఎన్నికల్లో పచ్చి మితవాది జేవియర్‌ మిలై విజయం సాధించాడు. వామపక్షాల మద్దతు ఉన్న అధికార పెరోనిస్టు పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, కూటమి అభ్యర్థి సెర్గియో మాసాకు 44 శాతం ఓట్లు రాగా మిలై 56 శాతం తెచ్చుకున్నాడు. డిసెంబరు పదవ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. మార్కెట్‌ అనుకూల మిలై వాగాడంబరా నికి మితవాద శక్తులు, అసంతృప్తి చెందిన యువతరం అధికార కూటమికి వ్యతిరేకంగా ఓటు చేసినట్లు కనిపిస్తోంది.
          కరోనా, ఇతర వైఫల్యాల కారణంగా తలెత్తిన పరిస్థితిని ఉపయోగించుకొని జేవియర్‌ మిలై 2021 పార్లమెంటు ఎన్నికల్లో కొత్త పార్టీతో రంగంలోకి దిగాడు. వాస్తవ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన అభ్యర్ధిని తాను మాత్రమేనని మిలై చెప్పాడు. అతగాడికి కుక్కలంటే పిచ్చి. వాటి భాషలో మాట్లాడతాడు. ఎన్నికలకు ముందు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రికతో మాట్లాడుతూ ద్రవ్యోల్బణాన్ని తగ్గించటం గురించి ఆలోచిస్తున్నానని, అందుకుగాను తన దగ్గర ఐదు కుక్కలున్నాయని, అవి పది లేదా ఇరవై కూడా కావచ్చు అని చెప్పాడు. వాటిని వదిలితే తగ్గుతుందన్నాడు. మిలై దృష్టిలో కుక్కలంటే రాజ్యాన్ని పక్కన పెట్టి మొత్తం వ్యవస్థను పెట్టుబడిదారులకు అప్పగించాలని ప్రబోధించే ప్రముఖులు. ఆర్థిక సమస్యలను పరిష్కరించటానికి రాజ్యం ఒక పరిష్కారం కాదు, అదే అసలు సమస్య అని కూడా చెప్పాడు. దేశంలోని మొత్తం రాజకీయ తరగతి అంతా దొంగలని, పన్నులు విధించాలని కోరటం హింసాత్మక చర్య అన్నాడు. ఇతగాడి నోటి దురుసుతనంతో అసంతృప్తితో ఉన్న జనం మద్దతుదారులుగా మారవచ్చు, ఓట్లు వేయవచ్చు, నిజంగా అధికారం వస్తే ఎలా పాలిస్తాడో ఏ తిప్పలు తెచ్చిపెడతాడో అన్న భయాన్ని వెల్లడించిన వారు కూడా లేకపోలేదు. చివరకు అదే నిజమైంది. ప్రాథమిక ఎన్నికల్లోనే అర్జెంటీనాకు పచ్చి మితవాద శక్తుల ముప్పు ముంచుకువస్తున్నట్లు వెల్లడైంది. ఫలితాలు అనేక మందిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. కొత్త రాజకీయ చర్చకు తెర తీశాయి. ఆ ఎన్నికల్లో స్వేచ్ఛతో ముందుకు (లిబర్టీ అడ్వాన్సెస్‌) పార్టీ నేతగా జేవియర్‌ మిలై అగ్రస్థానంలో నిలిచాడు. అక్టోబరు 22న జరిగిన తొలి దఫా ఎన్నికల్లో ఐదుగురు పోటీ చేశారు. వారిలో పెరోనిస్టు మాసాకు 36.78 శాతం, మిలైకి 29.99 శాతం, మూడో అభ్యర్ధికి 23.81 శాతం రాగా మిగిలిన ఇద్దరికీ కలిపి 9.43 శాతం వచ్చాయి. దీంతో నవంబరు 19న తుది దఫా మాసా-మిలై మధ్య పోటీ జరిగింది.
         ప్రాథమిక ఎన్నికల్లో మొదటి స్థానంలో ఉన్నట్లు ఫలితాలు వెల్లడి కావటంతో మిలై తన మద్దతుదారులతో సంబరాలు చేసుకున్నాడు. రాజకీయ నేతలు మారకపోతే వారిని వదిలించుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రస్తుత అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ చైనాను అనుమతించి కొన్ని కీలక రంగాలను అప్పగించాడని ఆరోపించాడు. తాను చైనాతో సంబంధాలను తెంచివేస్తానని, కమ్యూనిస్టులతో వ్యాపారం చేయనని అన్నాడు. కమ్యూనిజం గురించి అవాకులు, చవాకులు పేలాడు. తాను అధికారానికి వచ్చిన తరువాత దేశ రిజర్వుబాంకును రద్దు చేస్తానని, ప్రభుత్వ ఖర్చులో కోత పెడతానని, పతనమౌతున్న దేశ కరెన్సీ పెసోను రద్దు చేసి కొన్ని దేశాల మాదిరి అమెరికా డాలరును చట్టబద్దమైన కరెన్సీగా ప్రకటిస్తానని చెప్పాడు. అర్జెంటీనా ఎన్నికలు ఒక్క లాటిన్‌ అమెరికాకే కాదు, మొత్తం ప్రపంచానికే ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు.
        లాటిన్‌ అమెరికాను అమెరికా సామ్రాజ్యవాదం తన పెరటి తోటగా పరిగణించింది. తనకు లోబడిన వారిని గద్దె నెక్కించటం వీలుగాకపోతే మిలిటరీ నియంతలను రంగంలోకి తెచ్చింది. ఇదే సమయంలో ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ విధానాలను ఆ దేశాల మీద రుద్దారు. అవి వికటించటం, అనేక దేశాల్లో నియంతలు, మితవాద పాలకులకు వ్యతిరేకంగా వామపక్ష శక్తులు పార్లమెంటరీ పోరాటంతో పాటు ఆయుధాలు కూడా పట్టి జనాన్ని సమీకరించారు. దివాళాకోరు ఆర్థిక విధానాలతో పాలకులు ప్రజల నుంచి దూరం కావటం, ప్రతిఘటన తీవ్రమైన తరుణంలో విధిలేక ఎన్నికలు జరపటం వాటిలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది ఒక్కటిగా నిలవటంతో వామపక్ష శక్తులు అధికారానికి వచ్చాయి. ప్రజలకు మేలు చేయాలనే వైఖరిని బలపరిచారు. దోపిడీ వ్యవస్థ పునాదులను కూలిస్తే తప్ప జన జీవితాల్లో మౌలిక మార్పులు రావనే అంశాన్ని గుర్తించటంలో, అమలు జరపటంలో ఏకాభిప్రాయం లేదు. అందువల్లనే అధికారానికి వచ్చినచోట వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు గత పునాదుల మీదనే సామాన్య జనానికి ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవటంతో వరుసగా రెండు, మూడు సార్లు గెలుస్తూ వచ్చారు. అయితే వాటికి ఉన్న పరిమితులు వెల్లడి కావటంతో జనంలో తలెత్తిన అసంతృప్తి కారణంగా తిరిగి మితవాద శక్తులు తలెత్తుతున్నాయి.
         గతంలో మాదిరి నియంతలను రుద్దితే లాభం లేదని గుర్తించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను దెబ్బతీసేందుకు మితవాద శక్తులకు మద్దతు ఇస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచినప్పటికీ పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ అనుకూల విధానాల కారణంగా అసంతృప్తి తలెత్తి తిరిగి జనం వామపక్షాలకు పట్టంగడుతున్నారు. బ్రెజిల్‌లో లూలా అదే విధంగా మరోసారి గెలిచాడు. అర్జెంటీనాలో గత ఎన్నికల్లో జరిగింది అదే. ప్రజాతంత్ర, వామపక్ష శక్తులు మౌలిక విధానాల మార్పుల జోలికి పోని కారణంగా జన జీవితాల్లో పెద్ద మార్పులు రాలేదు. అర్జెంటీనాలో ప్రస్తుతం 45 శాతం జనం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. వార్షిక ద్రవ్యోల్బణం 143 శాతానికి చేరింది. ప్రభుత్వం వద్ద నగదు నిల్వలు లేవు. దశాబ్ది కాలంగా జిడిపి ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. కరెన్సీ విలువ పతనమైంది. అప్పుల మీదనే దేశం నడుస్తోంది. ఈ కారణంగానే మితవాద ఆర్థికవేత్త కూడా అయిన మిలై చేసిన సైద్ధాంతికపరమైన దాడికి నూతన తరం ఆకర్షితమైనట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న వాటన్నింటినీ రద్దు చేసి మొత్తం బాధ్యత అంతటినీ మార్కెట్‌ శక్తులకు వదలి వేస్తే అవే సమస్యలను పరిష్కరిస్తాయంటూ అరచేతిలో స్వర్గం చూపుతున్నాడు. ఏ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు బదిలీ చేసిందో ఆ లబ్ధి పొందిన పేదలు కూడా దానికి వ్యతిరేకంగా మితవాద మిలైకి ఓటు వేసినట్లు స్పష్టమైంది. మితవాద మిలై విప్లవాత్మక మార్పులను నిజంగా తెస్తాడని, మరొక మార్గం లేదని జనం భ్రమలకు గురైనట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
         నయా ఉదారవాద విధానాలకు శస్త్ర చికిత్స తప్ప పై పూతలతో దాన్ని సంస్కరించి ప్రజానుకూలంగా మార్చలేర న్నది గ్రహించాల్సి ఉంది. జనంలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకొని గద్దెనెక్కినప్పటికీ జేవియర్‌ మిలై తాను ప్రకటించిన అరాచక పెట్టుబడిదారీ విధానాలను అమలు జరపటం అంత తేలిక కాదు. 2021లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తరువాత 257 స్థానాలకు గాను పెరోనిస్టు కూటమికి 118, వర్కర్స్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌కు నాలుగు మినహా మిగిలిన సీట్లన్నింటిలో మితవాద పార్టీల కూటమికి 116, ఇతర మితవాద పార్టీలు, స్వతంత్రులు కలిపితే మెజారిటీ ఉన్నారు. అనేక దేశాల్లో అధికారానికి వచ్చిన మితవాదులు తొలుత తమ దాడిని కార్మికుల మీదనే ప్రారంభించిన నేపథ్యంలో మిలై ఆచరణ కూడా దానికి భిన్నంగా ఉంటుందని భావించలేము. అదే జరిగితే వెంటనే ప్రజా ప్రతిఘటన కూడా ప్రారంభం అవుతుంది.

ఎం. కోటేశ్వరరావు

koteswarrao