Nov 21,2023 07:17

          మెగా క్రికెట్‌ ఈవెంట్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఆస్ట్రేలియా కప్పు సాధించి జగజ్జేతగా నిలిచింది. వన్డే క్రికెట్‌లో ఆసిస్‌ ప్రపంచ టైటిల్‌ను సాధించడం ఇది ఆరవసారి. ఆస్ట్రేలియాకు ఇది చారిత్రక విజయం. టోర్నీలో ఆది నుంచీ అత్యుత్తమ పెర్ఫార్మెన్స్‌తో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్న భారత్‌ చివరి పరీక్షలో విఫలం కావటంతో మెగా కప్పు కల చెదిరిపోయింది. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌ నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి భారత ఆటగాళ్లను, కోట్లాది మంది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య జరిగిన ఫైనల్స్‌లో ఆరు వికెట్ల తేడాతో కంగారూలు విజయం సాధించారు. టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య జట్టు అయిన భారత్‌ తన సొంత గడ్డపై ఫైనల్స్‌లో ఓడిపోవడం క్రికెట్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రూపు మ్యాచుల్లో ఓటమి ఎరగకుండా వరుసగా పది విజయాలు సొంతం చేసుకుంది టీమిండియా. టైటిల్‌ను సాధించిన ఆస్ట్రేలియా లీగ్‌ దశలో రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో భారత్‌ చేతిలో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా చేతిలో 134 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. దాంతో సెమీఫైనల్‌కైనా వస్తుందా అనిపించింది. ఆ తర్వాత అన్ని గేమ్‌లనూ గెలిచి ఫైనల్‌కు చేరి, అప్పటి వరకు ఓటమి ఎరుగని భారత్‌ను చాకచక్యంగా ఓడించింది. క్రికెట్‌ ప్రపంచంలో ఇదొక చరిత్ర.
          మూడవ తడవ కప్పు సాధించాలన్న భారత్‌ ఆశలు చివరి ఘట్టంలో ఆవిరి కావడానికి కారణం స్వయంకృతాపరాధమే. గతంలో 2003లోనూ ఇలాగే జరిగింది. అప్పుడూ భారత్‌ ఆస్ట్రేలియాతోనే తలపడగా, ఆస్ట్రేలియా కప్పును ఎగరేసుకుపోయింది. ఇప్పటి వరకు 1984లో కపిల్‌దేవ్‌ సారథ్యంలో, 2011లో మహేంద్రసింగ్‌ ధోని కెప్టెన్సీలో మన దేశానికి వరల్డ్‌కప్‌ సాకారమైంది. మళ్లీ అటువంటి విజయం రావాలంటే భారత జట్టు అందుకు తగ్గట్టు సన్నద్ధం కావాలి. ఆదివారంనాటి ఫైనల్‌ మ్యాచ్‌ను చూసినట్లయితే మన టీంలోని లోపాలు, బలహీనతలు కనిపిస్తాయి. టీంలో పేసర్‌ ఆల్‌రౌండర్లు ఒకరిద్దరి కంటే లేరు. స్పిన్‌ ఆడేవారూ లేరు. ఫీల్డింగ్‌ కొంత వరకు బానే ఉందనిపించినా బ్యాంటింగ్‌ దగ్గరికొచ్చేసరికి తడబడ్డారు. ఇటువంటి తప్పులే టీమిండియా కప్పు చేజార్చుకోడానికి కారణమయ్యాయని క్రీడా విశ్లేషకులు బలంగా నొక్కిచెబుతున్నారు. తొలుత అపజయాలు మూటగట్టుకొని కంగారు పడ్డ ఆస్ట్రేలియా, టీమిండియా బలహీనతలను సమర్ధవంతంగా అందిపుచ్చుకుంది. అనూహ్య ప్రతిభ కనబర్చి కప్పు గెలిచింది.
         కేంద్రంలో బిజెపి, నరేంద్ర మోడీ జమానా వచ్చాక ఆటల్లో క్రీడా స్ఫూర్తి కాకుండా మతోన్మాదాన్ని, సంకుచిత జాతీయతత్వాన్ని నూరిపోస్తోంది. మైదానంలో విజయాన్ని 'జాతీయవాదం' విజయంగా వ్యాఖ్యానించేదాకా పరిస్థితి వచ్చింది. వరల్డ్‌కప్‌ను ఒక ఫోబియా కింద మార్చేసింది. తమ సొంత జట్టు మాత్రమే గెలవాలన్న ఉన్మాదాన్ని కొన్ని హిందుత్వ శక్తులు పనిగట్టుకొని సామాజిక మాధ్యమాలలో విద్వేష ప్రచారం చేశాయి. విద్వేష పూరిత ప్రసంగాలు, ప్రకటనలు క్రీడాకారులను తిట్టేంత వరకు తెచ్చాయి. ఈ పరిస్థితులే ఫైనల్‌లో టీమిండియాను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. భావోద్వేగానికి కారణమయ్యాయి. దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఫైనల్‌ మ్యాచ్‌ను తమ సొంత ఖర్చులతో పోటీలు పడి భారీ స్క్రీన్లపై ప్రదర్శనలకు పురిగొల్పాయి. వేలాది మందిని సమీకరించారు. క్రికెట్‌కు మతం రంగు పులమడం ఆందోళనకరం. ఆటల్లో క్రీడా స్ఫూర్తి, ప్రతిభా పాటవాలు తప్ప మతం ఎంతమాత్రం ఉండదని విరాట్‌ కొహ్లీ, మహ్మద్‌ షమీ అద్భుత పెర్ఫార్మెన్సే విద్వేషకారులకు తిరుగులేని జవాబు. కోహ్లీ అత్యధిక సెంచరీలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు. టోర్నీ ఆఫ్‌ది ప్లేయర్‌గా నిలిచారు. క్రికెట్‌లో రాజకీయ జోక్యం, బెట్టింగ్‌లు పోవాలి. ఏ క్రీడలోనైనా ఒక్కరే గెలుస్తారు. ఇంకొకరు ఓడతారు. అంతమాత్రం చేత తలపడిన ఆటగాళ్లు తక్కువేం కాదు. వరల్డ్‌కప్‌ టోర్నీ ఇదే చివరిదీకాదు. నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్‌ 2027లో మళ్లీ ఉంటుంది. టీమిండియా లోపాలను అధిగమించి అన్ని హంగులతో సిద్ధం కావాలి. కప్పు సాధించిన ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు. చివరి వరకు పట్టుదలతో ఆడి తామేమీ తక్కువ కాదని నిరూపించిన టీమిండియాకూ దేశ ప్రజలందరూ కృతజ్ఞులు.