Nov 22,2023 07:15

ప్రజారక్షణ భేరి సందర్భంగా జరిగిన రాజకీయ క్యాంపెయిన్‌ సిపియం విశిష్టతను చాటిచెప్పింది. నాలుగు అంశాలతో కూడిన రాజకీయ విధానం చుట్టూ పార్టీని ఐక్యం చేయగలిగింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఒంటరిపాటు చేయడం, ఓడించడం ప్రధాన కర్తవ్యం కాగా, ఆ బిజెపికి వంత పాడుతున్న పార్టీలపై ఒత్తిడి తేవడం, వారి అవకాశవాద విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో చాలా వరకు కృతకృత్యులమయ్యాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై సిపియం రాజీలేని పోరు సాగించింది. వివిధ వర్గాలు, తరగతులు చేస్తున్న పోరాటాలకు ప్రజారక్షణభేరి మద్దతునిచ్చింది. కరువు, కరెంటు చార్జీల పెంపు, అధిక ధరలు, నిరుద్యోగం, దళితులపై దాడులు, భూపోరాటాలు, పోలవరం నిర్వాసితుల హక్కులు, విశాఖ ప్రైవేటీకరణ సమస్యలపై ప్రజలు వివిధ రూపాల్లో కదులుతున్నారు. కనీస వేతనాల కోసం మున్సిపల్‌ వర్కర్లు, అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. వాటిపై సమరశీల పోరాటాలు సాగుతున్నాయి.

         రెండు నెలలపాటు జరిగిన ప్రజారక్షణ భేరి రాష్ట్రవ్యాపిత క్యాంపెయిన్‌ 15వ తేదీ ప్రదర్శన, సభతో జయ ప్రదమైంది. ఈ క్యాంపెయిన్‌ అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. పార్టీలో విశ్వాసాన్ని నింపింది. ప్రజా ఉద్యమాలు మరో అడుగు ముందుకు వేయడానికి పురికొల్పింది. రాబో యే రోజుల్లో సిపియం పురోగమనానికి ఇది స్ఫూర్తినిస్తుంది. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతను ఈ సభ చాటిచెప్పింది.
 

                                                         నాలుగు దశల్లో ప్రణాళికాబద్ద కృషి

రాష్ట్రం ఎదుర్కొంటున్న వివిధ తరహా ప్రజా సమస్యలపై అన్ని జిల్లా కేంద్రాలలో వేర్వేరు అంశాలపై మొదటి దశలో సదస్సులు జరిగాయి. వివిధ జిల్లాల్లో సాగిన పాదయాత్రలు సమగ్రాభివృద్ధి ఆవశ్యకతను ముందుకు తెచ్చాయి. రెండవ దశలో మేధావులను ఆహ్వానించి ముఖ్యమైన అంశాలపై రెండు రోజుల రాష్ట్ర సెమినార్‌ నిర్వహించాం. ప్రజా ప్రణాళిక రూపకల్పనకు ఇది పునాది వేసింది. ఈ అంశాల ఆధారంగా 31 అంశాలతో మూడు ప్రాంతాల నుండి బస్సు యాత్రలు నడిచాయి. ఈ యాత్రల సందర్భంగా దారిపొడవునా స్థానిక సమస్యలపై వందలాది అర్జీలు అందాయి. ప్రజల సమస్యలు కుప్పలుతెప్పలుగా పెండింగ్‌లో ఉన్నాయన్న వాస్తవాన్ని ఈ అర్జీలు వెలుగులోకి తెచ్చాయి. 1902, జగనన్నకు చెప్పుకుందామన్న కాల్‌సెంటర్‌ జిమ్మిక్కులేవీ ఈ సమస్యలకు పరిష్కారం చూపలేదు. మోడీ ద్రోహంపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల పైనా అంతే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. నాలుగవ దశలో స్థానిక ప్రచారం, జనసమీకరణకు ఏర్పాట్లు, రెడ్‌షర్ట్‌ వలంటీర్ల శిక్షణ, కళాబృందాల మద్దతుతో 15వ తేదీ ప్రదర్శన, సభ ఉత్సాహపూరితంగా జరిగింది.
 

                                                    సిపియం రాజకీయ నిబద్దతకు నిదర్శనం

ప్రజారక్షణ భేరి సందర్భంగా జరిగిన రాజకీయ క్యాంపెయిన్‌ సిపియం విశిష్టతను చాటిచెప్పింది. నాలుగు అంశాలతో కూడిన రాజకీయ విధానం చుట్టూ పార్టీని ఐక్యం చేయగలిగింది. రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని ఒంటరిపాటు చేయడం, ఓడించడం ప్రధాన కర్తవ్యం కాగా, ఆ బిజెపికి వంత పాడుతున్న పార్టీలపై ఒత్తిడి తేవడం, వారి అవకాశవాద విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవడంలో చాలా వరకు కృతకృత్యులమయ్యాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై సిపియం రాజీలేని పోరు సాగించింది. వివిధ వర్గాలు, తరగతులు చేస్తున్న పోరాటాలకు ప్రజారక్షణభేరి మద్దతునిచ్చింది. కరువు, కరెంటు చార్జీల పెంపు, అధిక ధరలు, నిరుద్యోగం, దళితులపై దాడులు, భూపోరాటాలు, పోలవరం నిర్వాసితుల హక్కులు, విశాఖ ప్రైవేటీకరణ సమస్యలపై ప్రజలు వివిధ రూపాల్లో కదులుతున్నారు. కనీస వేతనాల కోసం మున్సిపల్‌ వర్కర్లు, అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. వాటిపై సమరశీల పోరాటాలు సాగుతున్నాయి. అమెరికాతో చేతులు కలిపి ఇజ్రాయిల్‌ దురాక్రమణకు గురైన పాలస్తీనా ప్రజలకు మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాం. పాలస్తీనాకు మద్దతు ఇవ్వడమంటే ఉగ్రవాదాన్ని బలపరుస్తున్నట్లు సంఫ్‌ుపరివారం, బిజెపి చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఇలాంటి బిజెపికి వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి, జనసేన ఎలా మద్దతునిస్తున్నాయో ప్రజలు ప్రశ్నించాలి. ప్రజా సమస్యలపై పోరాడుతూనే పార్టీ స్వతంత్ర రాజకీయ విధానం చుట్టూ ప్రజలను సమీకరించాలి.
 

                                                          అసమానతలు లేని అభివృద్ధి కోసం

రాష్ట్ర విభజనానంతరం ఈ పదేళ్ళలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం వెనుకబాటును ఎదుర్కొంటున్నది. ఆర్థిక అసమానతలు తీవ్రమయ్యాయి. కార్పొరేట్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగినా క్షేత్ర స్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు అడుగంటాయి. ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగాయి. వెనుకబడిన ప్రాంతాలకు ఇస్తామన్న నిధులు ఇవ్వకపోగా, ఇచ్చిన నిధులను కూడా కేంద్రం వెనక్కు తీసుకున్నది. రాష్ట్ర విభజన చట్టాన్ని ధిక్కరించి కృష్ణా జలాల సమీక్షకై కేంద్రం ఇచ్చిన గెజిట్‌ రాష్ట్రంపై బిజెపి పొడిచిన మరో వెన్నుపోటు. దేశం సూపర్‌ పవర్‌ అవుతుందన్న మోడీ మాటల్ని ఏజెన్సీ ప్రాంతం ఎగతాళి చేస్తున్నది. రోడ్లు, నీరు, విద్యా, వైద్యం ఏవీ లేక వివక్షతను ఎదుర్కొంటున్నది. దళితులపై దాడులు, ఇప్పటికీ కొనసాగుతున్న అంటరానితనం, సామాజిక అసమానతలను ఎత్తిచూపుతున్నది. లింగ వివక్షతతో చదువు, వేతనాలు, అత్యాచారాలు అన్నింట్లోనూ ఆడపిల్లలు బలిపశువులవుతు న్నారు. సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం యువతకు మద్యం, మాదకద్రవ్యాలు బహుమతిగా అందిస్తున్నది.
 

                                                                   ప్రత్యామ్నాయ ప్రణాళిక

అభివృద్ధి పేరుతో అన్ని పార్టీలు కార్పొరేట్లకు పెద్దపీట వేస్తున్నాయి. సులభతర వ్యాపారం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) పేరుతో భూములు, నీరు, మైనింగ్‌, కరెంట్‌ అన్నీ కట్టబెడుతున్నారు. బ్యాంకు రుణాలు ఎగ్గొడుతున్నారు. పన్నులు మినహాయింపు ఇస్తున్నారు. బడా కార్పొరేట్ల నుండి ఆ డబ్బులు గుంజి ప్రజలపై భారాలు వేయకుండానే సంక్షేమం, అభివృద్ధిని ముందుకు నడిపించవచ్చు. అప్పులు తగ్గించుకో వచ్చు.
         ఈ నేపథ్యంలో సిపియం ప్రజా ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రజల ముందుంచింది. దాని చుట్టూ వివిధ శ్రేణుల్ని సమైక్యపర్చాలి. సంక్షేమం పేరుతో నగదు బదిలీ కార్యక్రమాలను చేపట్టి, అదే పెద్ద విజయమని బాకాలూదుతున్న రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజారక్షణ భేరి ముందుకు తెచ్చింది. ఈ ప్రణాళిక తక్షణం ఈనాడున్న ఆర్థిక సామాజిక నేపథ్యంలో చిత్తశుద్ధి ఉన్న ఏ ప్రభుత్వమైనా అమలు చేయగలిగిన అంశాలనే ముందుకు తెచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చులు తగ్గుతున్నా విద్యుత్‌ ఉత్పత్తి కంపెనీలు దొంగ లెక్కలతో లాభాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకుంటున్నాయి. ఆ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా చార్జీలు పెంచింది. క్రమంగా అది ప్రజలకు అతి పెద్ద భారంగా మారుతున్నది. ఉత్పత్తి ఖర్చులు, క్రాస్‌ సబ్సిడీని పరిగణలోనికి తీసుకుంటే రూపాయికే యూనిట్‌ కరెంటు ఇవ్వవచ్చని ప్రజా ప్రణాళిక ముందుకు తెచ్చింది. దీనికితోడు ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్లను జనంపై రుద్దుతున్నది. వ్యవసాయ పంపుసెట్లకు బలవంతంగా మీటర్లు పెట్టింది. ఇప్పుడు ఇళ్ళకూ పెట్టేందుకు సన్నాహం చేస్తున్నారు. అదానీ, షిర్డీ సాయి లాంటి కంపెనీలను ఉద్ధరించడానికి తప్ప ఇవి ప్రజలకు మేలు చేయవు. పైగా భారం వేస్తుంది.
          ప్రభుత్వ పన్నులు తగ్గించుకుంటే పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ 60 రూపాయలకే ఇవ్వొచ్చు. ఇళ్ళ నిర్మాణాలు, మరమ్మతుల పనులకు పెరిగిన ఇసుక ధర శరాఘాతంగా మారింది. ఈ మూడేళ్ళలో మూడు రెట్లు పెరిగింది. ఇసుకపై ప్రభుత్వం నియంత్రణ పెట్టి ఉచితంగా ఇస్తే రవాణా ఖర్చుతో అందరికీ అందుబాటులోకి వస్తుంది. భారీ కట్టడాలకు ప్రత్యేక ధర నిర్ణయించి వసూలు చేయాలి. ధరల పెరుగుదల ముందు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేకూరుతున్న లబ్ధి ఏ మూలకూ సరిపోవడం లేదు. దానికి పన్నుల భారం తోడైంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న షరతులు, ప్రపంచబ్యాంకు సంస్కరణలు, వివిధ పద్ధతుల్లో ప్రజలపై భారాలు మోపుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఒకదానికొకటి పోటీ కావు. పరస్పర సహాయకాలు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల ఆదాయం పెరిగితే కొనుగోలు శక్తి పెరుగుతుంది. అది పారిశ్రామికాభివృద్ధికి దారితీస్తుంది. తద్వారా ఉపాధి విస్తరిస్తుంది. ఉద్యోగాలూ పెరుగుతాయి. కానీ ప్రభుత్వ భారాలు, అధిక ధరలు, పన్నుల వల్ల సంక్షేమ నగదు ఎందుకూ కొరగాకుండా పోతున్నది. ప్రజల ఆదాయాలు పెరగడానికి బదులుగా అప్పులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల ఆస్తులు, ఆదాయాలు పెంపుదలకు తోడ్పడే విధానాలు అవలంభించడంలేదు. ఆస్తికి మూలం భూమి, సొంత ఇళ్లు. నాలుగేళ్ళ క్రితం పూర్తయిన టిడ్కో ఇళ్ళను ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదు. కానీ తీసుకున్న రుణాలకు బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. జగనన్న కాలనీలు ఆధునిక మురికి కూపాలకు మారుపేరుగా నిలుస్తున్నాయి. ఏ సౌకర్యాలూ లేవు. అనేక ఏళ్ళుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్ళు కట్టుకొని నివాసముంటున్న పేదలకు పట్టాలు ఇవ్వడం లేదు. అనేకచోట్ల బలవంతంగా ఖాళీ చేయించి ఆ భూముల్ని సంపన్నులపరం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇలా నవరత్నాల పేరుతో ప్రజలను నిరాస్తిపరుల్ని చేస్తున్నది.
           ఈ కాలంలో ప్రజల ఆదాయాలూ పడిపోయాయి. ఆదాయం పెరగాలంటే ఉద్యోగాలు రావాలి. ఉపాధి పెరగాలి. కానీ భూపంపకం గురించి, కనీస వేతనాల గురించి వామపక్షాలు మినహా ఏ పార్టీ మాట్లాడడం లేదు. ప్రజలకు మేలు చేకూర్చే విధానాల గురించి కాకుండా ప్రధానమైన రెండు పార్టీలు ఒకరినొకరు దెబ్బ తీసుకునే అంశాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ యజ్ఞంలో సామాన్య ప్రజలు బలిపశువులవుతున్నారు. అందుకే ప్రజా ప్రణాళిక ద్వారా ప్రత్యామ్నాయ విధానాల ప్రచారానికి సిపియం నాంది పలికింది.
 

                                                         స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలు

ప్రజా రక్షణ భేరి సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇటీవల కాలంలో విజయవాడలో ఇంత పెద్ద ప్రదర్శన, సభ జరగలేదన్నది జన వాక్యం. ఇతర పార్టీల సభలకు భిన్నంగా జనం స్వచ్ఛందంగా తరలి వచ్చారు. సిపియం కు ప్రజలు, శ్రేయోభిలాషులే వ్యూహకర్తలు. ప్రజలే ఎక్కడికక్కడ నిధి వసూలు చేసుకొని వాహనాలు పెట్టుకున్నారు. ఎవరి భోజనాల ఖర్చు వారే భరించారు (కార్పొరేట్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్ల పాత్ర లేకుండా జరిగిన సభ ఇది.). అనేకమంది ముందుగానే ఆహారం మూటలు కట్టుకొని తెచ్చుకున్నారు. ప్రదర్శన, సభా ప్రాంగణమంతా నిర్వాహకులు మంచినీరు మాత్రమే సరఫరా చేశారు. రాజకీయం వ్యాపారంగా మారిన నేపథ్యంలో ఈ జన సమీకరణ నూతన రాజకీయ సంస్కృతికి నిదర్శనం. ఈ ప్రదర్శనలో ఎర్ర చొక్కా వలంటీర్ల కవాతు అందరినీ ఆకర్షించింది. 25 సంవత్సరాలలోపు యువతీ, యువకులు ఇందులో పాల్గొన్నారు. యువతులు, పిల్లలు సైతం ప్రదర్శించిన క్రమశిక్షణ అబ్బురపరిచింది. పెద్దవారు వయస్సును మరచిపోయి ఊరేగింపులో కదం తొక్కారు. వీరు కేవలం కవాతు కోసమే వచ్చినవారు కాదు. సేవా కార్యక్రమాల్లోనూ ప్రజలకండగా ఉండాలన్న దీక్షతో వచ్చారు. కరోనా కాలంలో ఈ వలంటీర్లే ప్రాణాలకు తెగించి వ్యాధిగ్రస్తులను ఆదుకున్నారు. మృతదేహాలను ఖననం చేశారు. కృష్ణా, గోదావరి వరదల్లో ప్రజలకు అండగా నిలబడ్డారు. రక్తదానం చేయడం, ట్యూషన్లు చెప్పడం వంటి అనేక రకాల సేవా కార్యమ్రాల్లో వీరు భాగస్వామ్యమయ్యారు. ఈ కొత్తతరం రాబోయే కాలానికి ఉద్యమ సారథులవుతారు. ప్రజారక్షణ భేరిలో పాల్గొన్న కళాబృందాలు సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనం. ఒకే దేశం, ఒకే సంస్కృతి పేరుతో భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని, వైవిధ్యాన్ని దెబ్బతీసి అగ్రవర్ణ హిందూ సంస్కృతిని అందరిపై రుద్దాలనుకునే బిజెపి సంఘపరివార కుట్రలకు ఇది మందు. బిజెపి చేస్తున్న సాంస్కృతిక యుద్ధం దేశాన్ని నిరంకుశ పాలనలోకి నడిపిస్తున్నది. నయా ఫాసిస్టు సంస్కృతి విస్తరిస్తున్న ప్రమాదం కంటికి ఎదురుగా కనిపిస్తున్నది. ఈ స్థితిలో ప్రదర్శన రాష్ట్రంలోని వివిధ ప్రాతాల, తెగల, తరగతుల, సాంస్కృతిక, కళా విశిష్టతను చాటిచెప్పింది. ఆ రకంగా ఇది కేవలం జన సమీకరణ మాత్రమే కాదు, దాని చుట్టూ దేశరక్షణ, ప్రజా ప్రయోజనాలు అల్లుకొని ఉన్నాయి. సిపియం విశిష్టతను చాటిచెప్పిన ప్రజారక్షణ భేరి క్యాంపెయిన్‌ జయప్రదం అవ్వడమంటే ప్రజా ఉద్యమాలను మరొక అడుగు ముందుకు నడిపించడమే.
 

                                                                    ప్రజాపక్షం కావాలి

రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాపక్షం ఆవశ్యకతను ఈ సభ ముందుకు తెచ్చింది. అధికారపక్షం ప్రజలపై భారాలు వేస్తుంటే ప్రతిపక్షం ప్రజా సమస్యలను స్వంత రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నది. దీనికి భిన్నంగా ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా వామపక్షాలు, సిపియం ముందుకు సాగుతాయి. రానున్న కాలంలో ఆ స్ఫూర్తే సిపియం శ్రేణులకు మార్గదర్శకమవుతుంది.

/ వ్యాసకర్త సిపియం రాష్ట్ర కార్యదర్శి /
వి. శ్రీనివాసరావు

v.srinivasarao