
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ... ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. బుధవారం.. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ... పశ్చిమ మధ్యను ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు.
బుధవారం నాటికి వాయుగుండంగా బలపడనున్నట్లు అంబేద్కర్ తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని అన్నారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని తెలిపారు. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు.