May 25,2023 13:24

న్యూఢిల్లీ  :   నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్‌ చేసిన ప్రతిపక్షాలపై ప్రధాని పరోక్షంగా విమర్శలు చేశారు. జపాన్‌, పపువా న్యూగినియా, ఆస్ట్రేలియా దేశాల పర్యటనను ముగించుకున్న ప్రధాని గురువారం ఉదయం భారత్‌ చేరుకున్నారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఇటీవల సిడ్నీలో జరిగిన ప్రవాస భారతీయుల  కమ్యూనిటీ కార్యక్రమం గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి సుమారు  20,000 మంది హాజరయ్యారని అన్నారు.     ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ సహా ఆ దేశ మాజీ ప్రధాని, అధికార, ప్రతిపక్ష ఎంపిలు కూడా ప్రేక్షకుల్లో ఉన్నారని అన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, వారంతా కలిసికట్టుగా హాజరయ్యారని అన్నారు.

వ్యాక్సిన్ల సరఫరాపై కూడా ప్రధాని స్పందించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రధాని ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయని అన్నారు.  ఇది శాంతికి చిహ్నాలైన బుద్ధుడు, గాంధీ నడయాడిన నేలని, మనం మన  శత్రువుల గురించి కూడా ఆలోచిస్తామని అన్నారు.  మనం కరుణతో ప్రేరేపితమైన వ్యక్తులమని ప్రధాని పేర్కొన్నారు. .

ఈ నెల 28న ప్రధాని మోడీ పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ప్రతిపక్షాలు నిర్ణయించాయి. తాము ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 20 పార్టీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతిని పూర్తిగా విస్మరించి, తానే పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించాలని మోడీ నిర్ణయించడం మన ప్రజాస్వామ్యానికి అవమానకరమే కాకుండా దానిపై దాడి చేయడమే అవుతుందని ప్రతిపక్షాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. రాష్ట్రపతి పదవిని కించపరచడానికే ఇటువంటి అమర్యాదకరమైన చర్యకు పాల్పడుతున్నారని, ఇదిరాజ్యాంగ స్ఫూర్తికి భంగకరమని ఆగ్రహం వ్యక్తం చేశాయి.