ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా సీ.ఎం.సాయి కాంత్ వర్మ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2015 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి అయినా సాయికాంత్ వర్మ గతంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తూ బదిలీ పై ఇక్కడికి వచ్చారు. ఇప్పటివరకు జీవీఎంసీ కమిషనర్ గా పనిచేసిన పి.రాజబాబు పదోన్నతి పై కృష్ణా జిల్లా కలెక్టర్ వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం సీఎం సాయి కాంత్ వర్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అతిపెద్ద కార్పొరేషన్ అయినా జీవీఎంసీకి కమిషనర్ గా రావటం ఎంతో గర్వంగా ఉందని తనకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా గతంలో పనిచేసిన కమిషనర్లు చేపట్టిన మంచి కార్యక్రమాలను తాను కూడా కొనసాగిస్తానని అధికారులు, మీడియా ప్రతినిధులు, తమ సలహాలు , సూచనలు ఇవ్వాలని తద్వారా కలిసికట్టుగా ముందుకు వెళ్దామని ఆయన అన్నారు. అనంతరం ఆయన జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఏ.మల్లికార్జున్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.