Jul 06,2023 13:27

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధేలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైకోర్టు సీజే జస్టిస్‌ పీకే మిశ్రా మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ను ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధేను తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సూచించింది. 2013లో జమ్మూ-కాశ్మీర్ హైకోర్టు కు న్యాయమూర్తిగా పనిచేసిన  జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌...  2022 నుంచి బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. గత సంవత్సరం ఈయనను మణిపూర్ హైకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం తేల్చకపోవడంతో దానిని రద్దు చేశారు. 
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ అలోక్‌ 2009 డిసెంబరులో అదే రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2018 నుంచి కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. తెలంగాణ, ఏపీలతో సహా.. 7 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రానున్నారు.