Nov 28,2022 16:45

ప్రజాశక్తి-రాంబిల్లి : నేవల్ బేస్ నిర్వాసితులు ఎనిమిది గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళన నేటికీ 29వ రోజుకి చేరుకుంది. నేవీ మెయిన్ గేటు ముందు ఎనిమిది గ్రామాల నిర్వాసిత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, నేవీ వలన సర్వం కోల్పోయిన మమ్మల్ని  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, జీవన భృతి కల్పించాలని,  పెండింగ్ ప్యాకేజీలు అందజేయాలని మత్స్యకారులకు చేపలు వేటకు అనుకూలంగా జట్టి నిర్మించాలని, నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, ఆధార్ కార్డు ఆధారంగానే శారద వరాహ  నదుల్లో చేపలు వేటకు పంపాలని, వ్యవసాయ భూములకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, స్మశాన స్థలాలు కేటాయించాలని, ప్రభావిత గ్రామాలను నిర్వాసిత గ్రామాలుగా గుర్తించి ప్యాకేజీలు అమలు చేయాలని, పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జి దేవుడు నాయుడు మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా నేవీ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేయడం ప్రభుత్వాలు తగదని, నిర్వాసితులు వారి సమస్యలు పరిష్కరించాలని ఆందోళన బాట పెట్టినప్పుడు కొన్ని సమస్యల పరిష్కరించి మిగతా వాటిని పరిష్కరించకుండా కాలయాపన చేయడంతో నిర్వాసితులు పలుమార్లు ఆందోళన బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో వ్యవహరించి ఎనిమిది గ్రామాల నేవీ నిర్వాసితులు ప్రభుత్వం ముందు ఉంచిన వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనిమిది గ్రామాలు జేఏసీ పెద్దలు వేలాదిమంది నిర్వాసితులు పాల్గొన్నారు.