Nov 16,2022 16:32

ఉక్రెయిన్‌ పనేనన్న రష్యా
ప్రెజెవొడొ (పోలెండ్‌), బ్రస్సెల్స్‌ : పోలెండ్‌ భూభాగంపై మంగళవారం రాత్రి పడిన క్షిపణి ఉక్రెయిన్‌ ప్రయోగించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంఘటనా స్థలంలోని చిత్రాలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు మాస్కో తెలిపింది. ప్రెజెవొడొ నగరానికి సమీపంలో క్షిపణి పడిన ఈ ఘటనలో ఇద్దరు మరణించారని పోలిష్‌ అధికారులు తెలిపారు. క్షిపణి విడిభాగాల ఫోటోలను తమ నిపుణులు విశ్లేషిస్తున్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ విడిభాగాలను ఉక్రెయిన్‌ వైమానికదళం ఉపయోగించే ఎస్‌ా300 వైమానిక రక్షణ వ్యవస్థ నుంచి ప్రయోగించిన క్షిపణి భాగాలుగా గుర్తించింది. అదే రోజు ఉక్రెయిన్‌ కమాండ్‌ సెంటర్లపై, ఇంధన సదుపాయాలపై రష్యా విమానాలు, నౌకలు పెద్ద ఎత్తున దాడులు జరిపాయని మంత్రిత్వశాఖ తెలిపింది. ఉక్రెయిన్‌ భూభాగంపై లక్ష్యాలను తాకేలానే అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరిగాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
బైడెన్‌ అత్యవసర సమావేశం
ఈ క్షిపణి దాడి తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మిత్రపక్షాల నేతలు బుధవారం అత్యవసరంగా చర్చలు జరిపారని వైట్‌హౌస్‌ తెలిపింది. అత్యంత త్వరగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో యురోపియన్‌ యూనియన్‌ నేతలు, జి 7 దేశాల అధినేతలు పాల్గన్నారు. జర్నలిస్టులను పంపివేసిన తరువాత జరిగిన ఈ సమావేశాన్ని అత్యవసర రౌండ్‌టేబుల్‌ సమావేశంగా వైట్‌హౌస్‌ పేర్కొంది. క్షిపణిపై సమాచారం ఇవ్వడం లేదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బైడెన్‌ సమాధానమిచ్చారు.
రష్యానే బాధ్యత వహించాలి : నాటో
ఉక్రెయిన్‌ విమాన విధ్వంసక క్షిపణి కాల్పుల ఫలితంగా పోలెండ్‌లో క్షిపణి పేలుడు జరిగి వుండవచ్చని నాటో ప్రధాన కార్యదర్శి జేన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ బుధవారం వ్యాఖ్యానించారు. రష్యా క్రూయిజ్‌ క్షిపణి దాడుల నుంచి ఉక్రెయిన్‌ భూభాగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఉక్రెయిన్‌ క్షిపణి వ్యవస్థ ప్రయోగించిన క్షిపణి అయి వుండవచ్చునని, అంతిమంగా రష్యానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.