Oct 18,2023 10:37
  • మూడు పార్టీల కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ?

వార్సా : పోలెండ్‌ ఎన్నికల్లో లిబరల్‌ ప్రతిపక్ష నేత డొనాల్డ్‌ టస్క్‌ అలయన్స్‌కు మెజారిటీ లభించింది. పాలక లా అండ్‌ జస్టిస్‌ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మూడు ప్రతిపక్ష పార్టీలు మెజారిటీ సీట్లను గెలుచుకున్నాయి. ఈ మూడు పార్టీలు కలిసి ఒక కూటమిగా ఇయుకి మరింత అనుకూల కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఆదివారం జరిగిన పోలెండ్‌ ఎన్నికల తుది అధికార ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మాజీ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ నేతృత్వంలో తదుపరి ప్రభుత్వం త్వరలో ఏర్పడనుంది. తాజా ఎన్నికల ఫలితాలతో పోలెండ్‌ విదేశాంగ విధానంలో మార్పులు సంభవించే అవకాశం వుంది. పాలక లా అండ్‌ జస్టిస్‌ పార్టీకి 35.38శాతం ఓట్లు లభించాయి. కానీ, మెజారిటీకి అవసరమైనన్ని సీట్లు రాలేదు. 30.7శాతం ఓట్లతో రెండో స్థానంలో సివిక్‌ కొయిలేషన్‌ (కెఓ) వుంది. మధ్యే మితవాద పార్టీ థర్డ్‌ వే 14.4శాతం ఓట్లతో మూడో స్థానంలో వుంది. న్యూ లెఫ్ట్‌ పార్టీకి 8.61శాతం ఓట్లు లభించాయి. ఇక సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ మూడు పార్టీలు చర్చలు జరపాల్సి వుంది. పాలక పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసే అవకాశం వుండొచ్చు, కానీ జయవంతమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పాలక పార్టీతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయగల అవకాశాలు వున్న ఫార్‌ రైట్‌ కాన్ఫెడరేషన్‌కు కేవలం 7.16శాతం ఓట్లే దక్కాయి.