Nov 19,2022 11:22

పోలాండ్‌ : ఖతార్‌లో ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఆ టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా ఖతార్‌ చేరుకుంటున్నాయి. ఇక పోలాండ్‌ జాతీయ ఫుట్‌బాల్‌ జట్టు కూడా ఖతార్‌ పయనమైంది. అయితే, ఖతార్‌ వెళ్లాలంటే రష్యా, ఉక్రెయిన్‌ దేశాల గగనతలం నుంచి విమానం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న క్రమంలో తమ విమానంపై క్షిపణి దాడి జరిగే ప్రమాదం ఉందని పోలాండ్‌ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలాండ్‌ ఫుట్‌ బాల్‌ టీమ్‌ ప్రయాణించే విమానానికి ఎఫ్‌-16 యుద్ధ విమానాలను పోలాండ్‌ ప్రభుత్వం ఎస్కార్ట్‌గా పంపించింది. ఆకాశంలో తమ విమానానికి తోడుగా వస్తున్న యుద్ధ విమానాలను ఆటగాళ్లు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టి, యుద్ధ విమానాల పైలట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.