Oct 16,2023 17:53
  • నవంబర్‌ ఏడు నుంచి క్యాంపెయిన్‌
  • ఎఐపిఎస్‌ఎన్‌ వర్కుషాపులో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌

ప్రజాశక్తి - కాకినాడ : దేశవ్యాప్తంగా శాస్త్రీయ దృక్పథాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎం.గేయానంద్‌ కోరారు. కాకినాడలోని జెఎన్‌యుకెలో ఆలిండియా పీపుల్స్‌ సైన్స్‌ నెట్‌వర్క్‌ (ఎఐపిఎస్‌ఎన్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ రిసోర్స్‌ పర్సన్స్‌ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైన్స్‌ వ్యతిరేక, హేతువిరుద్ధ అంశాలకు ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిస్తూ శాస్త్రీయతను, ప్రశ్నించే తత్వాన్ని బలహీనపరచాలని చూస్తున్నాయన్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. శాస్త్రీయతతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఫెసిలిటేటర్లుగా హాజరైన ఎఐపిఎస్‌ఎన్‌ జనరల్‌ సెక్రటరీ ఆశా మిశ్రా, ఎఐపిఎస్‌ఎన్‌ సైంటిఫిక్‌ టెంపర్‌ డెస్క్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ అరుణభమిశ్ర మాట్లాడుతూ.. సైన్సును ప్రచారం చేయడం అనేది విద్యావంతులు, సైన్స్‌ రంగ కార్యకర్తల సామాజిక బాధ్యతన్నారు. మానవ మనుగడకు, సమాజ ప్రగతికి కారణమైన సైన్సును ప్రచారం చేసేందుకు శాస్త్రవేత్తలు మేరీ క్యూరీ, సివి.రామన్‌ పుట్టినరోజు అయిన నవంబర్‌ ఏడు నుంచి ఈ క్యాంపెయిన్‌ ప్రారంభించి, జాతీయ సైన్సు దినోత్సవం ఫిబ్రవరి 28 వరకు వివిధ దశల్లో దేశ వ్యాప్తంగా కొనసాగించాలని కోరారు. సైన్స్‌పై అవగాహనను పెంపొందించేందుకు రచయితలు, కళాకారులు, మెజీషియన్లు, సోషల్‌ మీడియా కార్యకర్తలతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. శాస్త్రీయ అవగాహన పెంపొందించడం కోసం ఈ వర్క్‌ షాప్‌లో విద్యార్థులకు, ప్రజలకు వివిధ సైన్స్‌ ప్రయోగాలను చేసేందుకు రిసోర్స్‌ పర్సన్‌లకు శిక్షణ ఇచ్చారు. 'విశ్వం ఆవిర్భావం- మానవుని పుట్టుక' అనే అంశంపై నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కాలేషా బాషా పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. దేశంలో కులవ్యవస్థ, అంటరానితనం వంటి అమానవీయ దురాచారాలు వ్యవస్థీకృతం అయ్యాయన్నారు. ఈ క్రమంలో ఏర్పడిన మూఢాచారాలు, అశాస్త్రీయ ధోరణుల నుంచి సమాజాన్ని మార్చేందుకు సైన్స్‌ సంస్థలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వంద మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వర్క్‌షాప్‌నకు ఎఐపిఎస్‌ఎన్‌ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.మురళీధర్‌ అధ్యక్షత వహించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్రా రామారావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కెఎంఎంఆర్‌.ప్రసాద్‌, టి.త్రిమూర్తులు, కె.శ్రీనివాస్‌, కెవివి సత్యనారాయణ, వైఎస్‌.నాగేశ్వరరావు, నిర్మల, డాక్టర్‌ కాలేషా, పివి.గోపాలరావు, జి.గిరిధర్‌, కాకినాడ జిల్లా నాయకులు వి.శ్రీరామారావు, వర్మ తదితరులు పాల్గొన్నారు.