ప్రజాశక్తి- చీరాల (బాపట్ల) : సెప్టెంబర్ 9, 10న బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ కోరారు. సోమవారం చీరాలలోని ఎన్‌జిఒ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం ప్రజలను ఎప్పటికప్పుడు జనవిజ్ఞానవేదిక చైతన్యవంతులను చేస్తూ మూఢనమ్మకాలను పాలద్రోలేందుకు కృషి చేస్తోందన్నారు. సమకాలీన పరిస్థితుల్లో ప్రజలల్లో శాస్త్రీయ ఆలోచన విధానం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సైన్స్ ప్రజల ఉమ్మడి ఆస్తి అని తెలిపారు. సూడో సైన్సు భావాలను ఖండించాలని కోరారు. సమాజ వృద్ధికి, ప్రజల్లో సైన్స్ ఆలోచనలను పెంపొందించడానికి ఈ మహాసభ ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం దేశంలో మూఢ నమ్మకాలు, అశాస్త్రీయ భావాలు పెరిగిపోయాయన్నారు. చంద్రయాన్-3 విజయాన్ని మహాసభలో స్ఫూర్తిదాయక అంశంగా చర్చిస్తామని చెప్పారు. ఇలాంటి పలు అంశాలపై జరగనున్న రాష్ట్ర మహాసభకు అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు త్రిమూర్తులురెడ్డి, రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కె.సుభాని, గాదె హరిహరరావు, చిన్నబాబు పాల్గొన్నారు.